ఆంధ్రా సమరంలో పోలింగ్ తర్వాత... తెదేపా, వైకాపా... సీట్ల లెక్కల్లో బిజీగా ఉంటే... జనసేన మాత్రం సైలెంట్ అయింది. ప్రచారానికి ముందు కింగ్ మేకర్లమవుతామనుకున్న ఆ పార్టీ.. ఎన్నికల తర్వాత మాటైనా లేకుండా ఎందుకలా ఉండిపోయింది? తెదేపా, వైకాపా ముందు ఎందుకు తేలిపోయింది. రెండు ప్రధాన పార్టీల గెలుపోటములపై ఆ పార్టీ ప్రభావమెంత?
ముఖ పరిచయం తక్కువే..
అభ్యర్థుల ఎంపికలో పవన్ లెక్క తప్పారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు పరిచయమే లేని అభ్యర్థులను బరిలో దింపడమే ఇందుకు కారణం. 2 ప్రధాన పార్టీల మధ్య జరిగిన పోరులో ఊసే లేకుండా పోయింది జనసేన. పవన్ కల్యాణ్‌కున్న ఫాలోయింగ్... కలిసొస్తుందనుకున్నా లెక్క తప్పింది. క్షేత్రస్థాయి నేతలేవ్వరూ కనీసం జనానికి ముఖ పరిచయం లేకపోవడమూ ఇందుకు కారణమే. ఆ పార్టీ నుంచి బరిలో ఉన్నవారిలో ప్రజలకు తెలిసిన వారిని వెళ్లపై లెక్కపెట్టొచ్చు.
త్రిముఖం కాదు...ద్విముఖమే..
ఎన్నికల హడావుడి మెుదలైనప్పుడు పోరు త్రిముఖమే అనుకున్నారంతా... వాస్తవంలో వైకాపా, తెదేపా మధ్యే పోరు సాగింది. చర్చంతా రెండు పార్టీల చుట్టే.... తిరిగేసరికి... జనసేన ఊసే లేకుండా పోయింది. క్షేత్రస్థాయిలో బలమైన కార్యకర్తలు లేకపోవడమూ... ఇందుకు కారణమే. యువతలోకి వెళ్లినంతా బలంగా... మిగతా వారిని ఆకట్టుకోవడంలో జనసైన్య విఫలమైంది. సభలకు వచ్చిన..వారిని ఓట్లుగా మలుచుకోవడంలో జనసేన విఫలమైంది.
అతడే ఒక సైన్యం
ప్రధాన పార్టీలతో పోల్చుకుంటే...జనసేన ప్రచారంలోనూ వెనకబడింది. పవన్ సభలు మినహా.. అభ్యర్థులెవ్వరూ బలంగా ప్రచారం చేయలేకపోయారు. పవన్ సమావేశాలు తప్ప ...పెద్దగా పార్టీ పేరు వినిపించలేదు. ఇప్పటికీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ముఖాలు సైతం తెలియని వారున్నారు. పవన్ ఉద్వేగభరిత మాటలు...హామీలు అభ్యర్థులు ప్రజల్లోకి సరిగా తీసుకుపోలేదనే విమర్శలున్నాయి. పవన్ మినహా చెప్పుకోదగిన నేతలు లేకపోవడం పార్టీని మరింత కిందకు నెట్టింది.
ప్రధాన పార్టీలపై ప్రభావం
సీట్లు గెలవడంలో విఫలమైన జనసేన... కొన్ని ముఖ్యమైన స్థానాల్లో గెలుపోటములను తారుమారు చేసింది. గోదావరి జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువ. తెదేపా గెలిచే స్థానాల్లో వైకాపా గెలిచేలా...వైకాపా గెలిచే కొన్ని స్థానాల్లో తెదేపా గెలిచేందుకు జనసేన ఓట్లు చీలికే కారణమైంది. 5 నుంచి 12 శాతం ఓట్లను కొల్లగొట్టింది.
ఇతర కారణాలు
జనసేన అంటే పవన్ కల్యాణ్ మాత్రమేననే భావన ప్రజల్లో కలిగింది. మిగిలిన నేతలు సైతం...పవన్ పైనే ఆశలు పెట్టుకోవడం, ప్రచారంలో సరిగా చేయకపోవడమే... ఆ పార్టీ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యేలా చేసింది. మేనిఫెస్టో అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉన్నా... ప్రజల్లోకి తీసుకెళ్లడంతో విఫలమయ్యారు జనసైనికులు. క్షేత్రస్థాయి కార్యకర్తలు పోల్మేనేజ్మెంట్లోనూ వెనకబడే ఉన్నారు. ప్రత్యర్థులంతా...ధన బలం ఉన్నవారు కావడం... పార్టీ పెద్ద నష్టంగా మారింది. సామాజిక మాధ్యమాల్లో ఉన్నంత ప్రచారం...క్షేత్రస్థాయిలో లేకపోవడమూ మరో కారణం.