ఎక్కువ రోజులు ప్రజల్లోనే...
1. తండ్రి రాజశేఖర్రెడ్డి మరణించాక జగన్ ఎక్కువ సమయం గడిపింది ప్రజల్లోనే. జగన్ పట్ల 2014 ఎన్నికల్లో ప్రజలు ఏ విధమైనా వ్యతిరేకతతో లేరు. కానీ... పొత్తులు, ఇతర రాజకీయ సమీకరణాల వల్ల కొద్దిశాతం తేడాతో అధికారానికి దూరమయ్యారు. ఈ ఎన్నికల్లోనూ ప్రజల్లోనూ ప్రజాభిమానం, ఆదరణ తగ్గలేదు. రాజకీయ సమీకరణాలూ మారాయి. ఇది జగన్కు కలిసొచ్చిన మొదటి అంశం.
అధికారానికి 'పాదయాత్ర'బాటలు...
2. పాదయాత్ర... ఇప్పటికే ఇద్దరిని ముఖ్యమంత్రులను చేసింది. 2004లో వైఎస్సార్ పాదయాత్ర వల్లే సీఎం అయ్యారనేది అంగీకరించాల్సిన విషయం. చంద్రబాబు అధికారంలోకి రావడంలోనూ పాదయాత్ర కీలక పాత్ర పోషించింది. ఎన్నికల ముందు జగన్ 3 వేల 600 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఈ యాత్రే... జగన్ సీఎం అవడానికి మరో ప్రధాన కారణమైంది.
ప్రత్యామ్నాయం జగనే...
3. సాధారణంగా అధికార పార్టీపై వ్యతిరేకత ఉంటుంది. ఈ ఎన్నికల్లో వ్యతిరేక ఓట్లన్నీ జగన్ పార్టీ వైకాపాకి పడ్డాయని చాలా విశ్లేషణలు వచ్చాయి. రాష్ట్రమంతా తెదేపా వర్సెస్ వైకాపాగా ఎన్నికలు జరిగాయి. తెదేపా అయిదేళ్ళ పాలనపై పూర్తి స్థాయిలో సంతృప్తి చెందని ప్రజలకు.. జగన్ ప్రత్యామ్నయంగా కనిపించారు. అందుకే ఎన్నికల ప్రారంభం నుంచి జగన్ కచ్చితంగా సీఎం అవుతారని చాలామంది అంచనా వేశారు.
రాజన్న రాజ్యం మళ్లీ తెస్తాననే నినాదం...
4. 'రావాలి జగన్ - కావాలి జగన్' నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. జగన్ను ఎందుకు సీఎం చేయకూడదనే ప్రశ్న ప్రజల్లో మొదలైంది. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన పథకాలు, చంద్రబాబు పథకాలను పోల్చుకున్న జనానికి మళ్ళీ జగన్ వస్తే పాత పథకాలు వస్తాయన్న చర్చ జరిగింది. చాలామంది చంద్రబాబు పథకాలపై మక్కువ చూపినా... రాజన్న రాజ్యం మళ్లీ తెస్తానని జగన్ ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రభావితం చేసింది.