రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైకాపా అధినేత జగన్మోహన్రెడ్డి దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ జగన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. జగన్ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన అతిథులు, జగన్ కుటుంబ సభ్యులు అనుసంధానంగా ఏర్పాటు చేసిన వేదికపై ఆశీనులయ్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్ జగన్కు శుభాకాంక్షలు తెలిపారు.
దైవసాక్షిగా... జగన్మోహన్ రెడ్డి ప్రమాణం - cm jagan
రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ జగన్‌తో ప్రమాణం చేయించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, గ్యాలరీ అభిమానులతో నిండిపోయింది.
ఇక వేదిక ముందు వరుస గ్యాలరీలో హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయాధికారులు, జగన్ బంధువులు, వేదిక ముందున్న ఏ2 గ్యాలరీలో ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు కూర్చున్నారు. ఏ2 గ్యాలరీలో పార్టీ నేతలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, బి1 గ్యాలరీలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్ అధికారులు, బి2 గ్యాలరీలో బార్ అసోసియేషన్ సభ్యులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు, వేదిక ముందు, చివరలో సాధారణ ప్రజానీకం వీక్షించారు. స్టేడియం లోపల 30 వేలమంది, బయట 10 వేలమంది ప్రమాణస్వీకారం తిలకించారు. స్టేడియం బయట ఉన్న అభిమానులు భారీ తెరల ద్వారా జగన్ ప్రమాణ స్వీకారం వీక్షించారు. జగన్ ప్రమాణం చేసేటప్పుడు తన పేరు చెప్పేటప్పుడు అభిమానులు, కార్యకర్తల నుంచి భారీ ఎత్తున స్పందన వెల్లువెత్తింది.
ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్ నరసింహన్ జగన్కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.