వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేపట్టి, ఇప్పటికీ పూర్తికాని ప్రాజెక్టుల నిర్మాణాన్ని కొలిక్కి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు 14 ప్రాజెక్టులను పరిగణనలోకి తీసుకుని ఎంత ఖర్చువుతుందో లెక్కలు వేసినట్లు తెలుస్తోంది. ఆయా ప్రాజెక్టులు పూర్తిచేయాలంటే 38వేల 23కోట్లు అవసరమని నివేదిక సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే అసరమున్నచోట పునరావాసం కల్పించే లెక్కలు ఇందులో ఉన్నదీ, లేనిదీ స్పష్టతలేదు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే 31 లక్షల 64వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. తెలుగుదేశం హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల్లో అంచనాల పెంపు, నిబంధనల ఉల్లంఘన, టెండర్ల ప్రక్రియలో లోపాలు ఉన్నాయంటున్న ప్రభుత్వం... వాటిపై నిపుణుల కమిటీతో విచారణ జరిపిస్తోంది. అదే సమయంలో జలయజ్ఞం ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేయడానికి చర్యలు తీసుకోవాలనే యోచనలో ఉంది.
జలయజ్ఞం పూర్తికి సంకల్పం.. 38,023 కోట్లు అవసరం - funds need
జలయజ్ఞం కింద వైఎస్ఆర్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులపై జగన్ ప్రభుత్వం దృష్టి సారించింది. వాటి పూర్తికి 38వేల కోట్లకు పైగా నిధులు అవసరమని ప్రభుత్వం అంచనా వేస్తోంది. తెదేపా ప్రభుత్వంలో ప్రాజెక్టుల్లో అంచనాల పెంపు, టెండర్ల లోపాలపై నిపుణులతో విచారణ జరిపిస్తూనే జలయజ్ఞం ప్రాజెక్టులు పూర్తిచేయండపై దృష్టిపెట్టింది.

పోలవరం, వంశధార రెండోదశ, తోటపల్లి, తారకరామతీర్థ, వెలిగొండ ప్రాజెక్టు, కొరిశపూడి ఎత్తిపోతల, సంగం బ్యారేజి, నెల్లూరు బ్యారేజి, గాలేరు-నగరి, హంద్రీ-నీవా తొలిదశ పనులు, గోదావరి, కృష్ణా, ఏలేరు వ్యవస్థల ఆధునికీకరణను వైఎస్ఆర్ హయాంలో ప్రారంభించారు. ఇప్పటికీ ఈ పనులు పూర్తికాలేదు. ఆధునికీకరణకు సంబంధించి కొన్ని ప్యాకేజీలు నిలిపివేసి, కొన్నింటిలో మార్పులు చేసి పనులు చేస్తున్నారు. వీటిలో పోలవరం, వెలిగొండ మినహా... మిగిలిన ప్రాజెక్టులు కొలిక్కి వచ్చాయి. దాదాపుగా మూడొంతులకు పైగా పనులు పూర్తయ్యాయి. ఇక పెద్దగా నిధులు వెచ్చించాల్సిన అవసరం లేదు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టును సాగులోకి తెచ్చేందుకు వీలవుతుందని జలవనరులశాఖ అధికారులు చెబుతున్నారు.