రాష్ట్ర బడ్జెట్‌లో నవరత్నాల అమలుకు అధిక ప్రధాన్యం ఇవ్వాలని ఆర్థికశాఖ అధికారులకు ముఖ్యమంత్రి జగన్ సూచించారు. ఆ శాఖ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం....రాష్ట్ర బడ్జెట్‌లో నవరత్నాలకు నిధుల కేటాయింపు అంశంపై చర్చించారు. నవరత్నాలే ప్రధాన అజెండాగా రాష్ట్ర బడ్జెట్‌కు రూపకల్పన చేయాలని స్పష్టం చేశారు. రైతు భరోసా, గ్రామ వాలంటీర్లు, అమ్మఒడి, దశలవారీ మద్యనిషేధం తదితర నవరత్నాల పథకాలకు సంబంధించి కేటాయింపులపై ప్రత్యేకంగా ఆరా తీశారు
ఆదాయ మార్గాలు అన్వేషించండి
రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏ మేరకు ఉన్నాయని ముఖ్యమంత్రి జగన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కన్వెర్జెన్సు ద్వారా నిధులను ఏమేరకు రాష్ట్ర పథకాలకు వినియోగించుకునే అవకాశముందన్న అంశంపైనా వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీటితో పాటు రాష్ట్రంలో ఆదాయ వనరులను పెంచుకోవాల్సిన అవసరంపైనా సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలపై ఎలాంటి భారం పడకుండా ప్రత్యామ్నాయ ఆదాయమార్గాలను అన్వేషించాలని జగన్ స్పష్టం చేశారు. అనవసరపు ఖర్చులు తగ్గించేలా బడ్జెట్ ఉండాలని ఆర్థికమంత్రి బుగ్గనకు సీఎం తేల్చి చెప్పారు.
ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖలు నవరత్నాల ప్రణాళిక అమలుకు అనుగుణంగా కొన్ని ప్రతిపాదనలు ఆర్థిక శాఖకు సమర్పించాయి. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు 17 రోజుల పాటు నిర్వహించాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ సూచించింది.