తమతో పాటు చదువుకుని, ఆడుకుని ఇప్పుడు ముఖ్యమంత్రి కావడం తమకు గర్వంగా ఉందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్నేహితులు అంటున్నారు. సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా ఆయన డిగ్రీ స్నేహితులు.. వారు చదువుకున్న హైదరాబాద్ కోఠిలోని ప్రగతి మహా విద్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. జగన్‌తో వారికున్న జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్నారు.
జగన్ మా స్నేహితుడు.. కలిసే చదువుకున్నాం! - koti
తమతో చదువుకున్న వ్యక్తి కాస్త పేరు సంపాందిస్తేనే ఎంతో గొప్ప. అదే ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే వారి ఆనందానికి అవధులు ఉండవు. ఇప్పుడు అదే అనుభూతి పొందుతున్నారు ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి జగన్ స్నేహితులు. ఆయనతో గడిపిన జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటున్నారు.
జగన్ మోహన్‌రెడ్డి 1991 నుంచి 1994 మధ్య ప్రగతి మహా విద్యాలయంలో డిగ్రీ పూర్తి చేశారని కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. తెలివిగల విద్యార్థి అని...అందరితో కలిసిపోయే స్వభావమని కొనియాడారు. బి.కామ్‌లో ప్రథమ స్థానంలో రాణించారని..తమ కళాశాలలో చదివిన జగన్ సీఎం కావడం తమకు ఆనందంగా ఉందని యాజమాన్యం పేర్కొంది. ఆయనతోపాటు కలిసి చదువుకున్నందుకు సంతోషంగా ఉందని జగన్ స్నేహితుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
జగన్ కళాశాలలో చేరే సమయానికి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంపీగా ఉన్నారని...అయినా..సాధారణ వ్యక్తిలా ఉండే వాడని స్నేహితులు తమ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. 30న ప్రమాణ స్వీకారం రోజు మహా విద్యాలయంలో స్నేహితులంతా కలిసి సంబరాలను చేసుకుంటామని జగన్ స్నేహితులు వెల్లడించారు.