'అసెంబ్లీలో చంద్రబాబు మాటలకు షాక్కు గురయ్యా' - ysr
శాసనసభలో ఎలా ప్రవర్తించాలనే విషయంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ముఖ్యమంత్రి జగన్ దిశానిర్దేశం చేశారు. వైఎస్సార్ హయాంలో అసెంబ్లీలో జరిగిన ఓ విషయాన్ని ఉదాహరణగా వివరించారు.
అసెంబ్లీలో ప్రతిపక్షాలకు మాట్లాడే సమయాన్ని తమ ప్రభుత్వం కల్పిస్తుందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. వారు కూడా మాట్లాడినప్పుడే ప్రజలకు నిజాలు తెలుస్తాయని అన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు శిక్షణ తరగతుల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు. అసెంబ్లీలో ఎలా మాట్లాడాలి అనే విషయంపై వారికి వివరించారు. తన తండ్రి వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఓ సంఘటనను సభ్యులకు గుర్తు చేశారు. "చంద్రబాబు ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు ఓ ప్రాజెక్టు విషయంపై తప్పుడు డాక్యుమెంట్ను తీసుకువచ్చి అసెంబ్లీలో మాట్లాడారు. ఆయన ఏం చెబుతున్నారని అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మా నాన్నకు కూడా ఒకింత అర్థం కాలేదు. తరువాత రోజు దానిపై డేటా మొత్తం సేకరించి చూస్తే చంద్రబాబు అబద్ధాలు చెప్పారని నాన్న తెలుసుకున్నారు. ఇదేంటయ్యా అసత్యాలు చెప్పావని వైఎస్సార్ ప్రశ్నిస్తే... తనకు అబద్ధాలు మామూలే అని చంద్రబాబు సమాధానం ఇచ్చారు. అసెంబ్లీ రికార్డులు సాక్షిగా ఈ మాట అన్నారు. ప్రతిపక్షాలు తప్పులు చెబితేనే ప్రభుత్వం నిజాలు చెబుతుందని చంద్రబాబు అన్నారు" అని జగన్ గుర్తు చేశారు. ఆ మాటలకు తాను కూడా షాక్కు గురయ్యాయని వివరించారు. "మీరు మాత్రం ఇలా ప్రవర్తించవద్దు" అని తమ పార్టీ నేతలకు సలహా ఇచ్చారు.