సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్... మంత్రి వర్గ కూర్పుపై దృష్టి సారించారు. ప్రాంతాలు, సామాజిక వర్గాలు, నేతల ప్రాముఖ్యత... తొలి నుంచి పార్టీకి అందించిన సేవలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేయనున్నారు. పలు జిల్లాల్లో మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఎవరికి అవకాశం ఇవ్వాలనే విషయమై పార్టీ ముఖ్య నేతల అభిప్రాయం తీసుకుంటున్నారు జగన్. అన్ని అంశాల్లోనూ సమతూల్యం ఉండేలా తుది జాబితాను రూపొందిస్తున్నారు.
7న భేటీ..
మంత్రి వర్గంపై తాను తీసుకున్న నిర్ణయాలను ముందుగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వివరించాలని జగన్ నిర్ణయించారు. ఈనెల 7న వైకాపా శాసనసభా పక్ష సమావేశం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేశారు. పార్టీ నుంచి ఎంపికైన 151 ఎమ్మెల్యేల సహా ఎమ్మెల్సీలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. 67 మంది ఎమ్మెల్యేలు తొలిసారి శాసనసభలో అడుగు పెడుతున్నారు. సీఎం మినహా మిగిలిన 83 మందిలో చాలామంది రెండు సార్లు ఆ పైన ఎన్నికైన వారు ఉన్నారు. పార్టీలోని పలువురు ఎమ్మెల్సీలు సైతం అమాత్య పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. కష్టకాలంలో అండగా ఉన్న వారు.. జిల్లాల్లో ప్రజాదరణ కలిగిన ముఖ్యనేతలు తమకు అవకాశం కల్పించాలని జగన్ ను కోరుతున్నారు. ఇలాంటి వారు 50 మందికి పైగా ఉన్నారు.