రాష్ట్రంలో కొలువుదీరనున్న కొత్త మంత్రివర్గంలో ప్రాంతాలు, సామాజిక వర్గాల వారీగా బెర్తులు ఖాయమయ్యాయి. కాకినాడ రూరల్ నుంచి కురసాల కన్నబాబుకు కేబినెట్లో చోటు కల్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు అదే జిల్లాలోని యర్రగొండపాలేనికి చెందిన ఆదిమూలపు సురేష్‌కు భెర్తు ఖాయమయ్యింది. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచి అవంతి శ్రీనివాస్ పేరును మంత్రివర్గంలో చేర్చారు. గిరిజన సామాజిక వర్గం నుంచి కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణికి మంత్రివర్గంలో చోటు కల్పించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణ దాస్‌కు, విజయనగరం జిల్లా పార్టీలో సీనియర్ నేతగా ఉన్న బొత్స సత్యనారాయణకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మోపిదేవి వెంకటరమణ, బుగ్గన రాజేంద్రనాథ్, ఆళ్ల రామకృష్ణారెడ్డి, జయరామ్, నారాయణస్వామి, అంజద్ బాషాకూ మంత్రులుగా అవకాశం కల్పించారు.
ఎమ్మెల్సీ కోటాలో పిల్లి సుబాష్ చంద్రబోస్‌కు మంత్రిగా పదవి ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి అమలాపురం ఎమ్మెల్యే పినిపె విశ్వరూప్‌కు మంత్రి వర్గంలో చోటు కల్పించారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌కు మంత్రివర్గంలో చోటు దక్కింది. ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు చోటు కల్పించారు. కొవ్వూరు ఎమ్మెల్యే తానేటి వనితను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లా నుంచి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, మచిలీపట్నం ఎమ్మెల్లే పేర్ని నానిలకు మంత్రివర్గంలో చోటు దక్కింది. గుంటూరు జిల్లా నుంచి పత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరితకు చోటు దక్కింది.