- వైఎస్ఆర్ రైతు భరోసా
వైకాపా ప్రభుత్వం తొలిసారిగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో నవరత్నాలకు భారీగా నిధులు కేటాయించారు. వైఎస్ఆర్ రైతు భరోసాకు అధికంగా రూ.8,750 కోట్లు కేటాయించారు. దీని వల్ల రాష్ట్రంలో 64.06 లక్షల మందికి లబ్ది చేకూరనుందని ఆర్థిక మంత్రి తెలిపారు. కౌలు రైతులను అర్హులుగా గుర్తించిన తొలి ప్రభుత్వం తమదేనని మమంత్రి బుగ్గన అన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 15 నుంచి ఈ మొత్తాన్ని రైతులకు పంచనున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ వడ్డీలేని రుణాలు పథకానికి బడ్జెట్లో నామమాత్రంగా రూ.100 కోట్లను ప్రతిపాదించారు. వైఎస్ఆర్ పంటల భీమా పథకానికి రూ.1,163 కోట్ల బడ్జెట్ను కేటాయించారు.
- అమ్మఒడి
1వ తరగతి నుంచి 10 వరకు విద్యార్థులకు ఏడాది రూ.15 వేల చొప్పున సాయం అందించే లక్ష్యంగా ప్రకటించిన అమ్మఒడి పథకానికి రూ.6,455 కోట్ల బడ్జెట్ కేటాయించారు. దాదాపు 43 లక్షల మందికి దీని ద్వారా లబ్ది చేకూరనుందని మంత్రి బుగ్గన వెల్లడించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో విద్యకు సంబంధించిన అన్ని ప్రమాణాలను మెరుగు పరుస్తామని తెలిపారు.
- ఆరోగ్యశ్రీ
ప్రతి పేద కుటుంబానికి వైద్యం అందేందుకు రూపొందించిన ఆరోగ్యశ్రీ పథకానికి రూ.1,740 కోట్లు కేటాయించారు. వార్షిక ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువగా ఉన్న అన్ని కుటుంబాలకు ఇది వర్తిస్తుందని మంత్రి తెలిపారు. పథకం కింద రాష్ట్రంతోపాటు హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు వంటి ప్రధాన నగరాల్లో ఎక్కడైనా చికిత్స తీసుకోవచ్చని స్పష్టం చేశారు.
- వైఎస్ఆర్ గృహ నిర్మాణ పథకం
రాష్ట్రంలో రాబోయే 5 సంవత్సరాల్లో, 25 లక్షల గృహాలను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోందని మంత్రి బుగ్గన తెలిపారు. ఈ కార్యక్రమానికి రూ.8,615 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు.
- వైఎస్ఆర్ పింఛను కానుక
వైఎస్ఆర్ పింఛను కానుక పథకం కింద వృద్ధులకు 2 వేల నుంచి 3 వేల వరకు పింఛన్ పెంచుతానని ముఖ్యమంత్రి ఎన్నికల హామీ ఇచ్చారు. దీనికనుగుణంగా ఈ పథకానికి రూ.15,746.58 కోట్ల భారీ మొత్తాన్ని బడ్జెట్లో కేటాయించారు. దీనివల్ల సుమారు 65 లక్షల మంది పింఛన్దారులు లబ్ధి పొందనున్నారని మంత్రి పేర్కొన్నారు.