నిబంధనలకు విరుద్ధంగా బోర్లు తవ్వుతున్నారు నియమ నిబంధనలు గాలికి వదిలి ఎక్కడ పడితే అక్కడ బోర్లు వేస్తున్నారు. నీటి కోసం ఎంత లోతుకైనా పోతున్నారు. సాధారణంగా 150 అడుగుల వరకే బోరు బావుల తవ్వకానికి అనుమతిస్తారు. 400 అడుగులకు మించి అక్రమంగా తవ్వుతూ భూగర్భాన్ని పీల్చేస్తున్నారు. జీహెచ్ఎంసీ లెక్కల ప్రకారం నగరంలో దాదాపు 18 లక్షలకుపైగా బోరుబావులున్నాయి. గత పదేళ్లతో పోల్చుకుంటే 5 రెట్లు బోరుబావులు పెరిగాయి. శేరిలింగంపల్లి వెస్ట్ జోన్ ఒక నెలలో 110 బోరుబావుల తవ్వకానికి దరఖాస్తులు రాగా... రెవెన్యూ అధికారులు 71కి అనుమతించారు. అక్రమంగా వందల్లో బోరుబావులు ఉన్నట్లు తెలుస్తోంది. నగరంలో జూన్ 2019 నాటికి సగటు నీటిమట్టం 10.33 మీటర్లకు పడిపోయింది. ఫలితంగా ఈ ఏడాది 70 వేల నుంచి లక్ష వరకు బోరుబావులు ఎండిపోయాయి.
సిమెంట్‌తో కప్పడమే సమస్య
భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయిలో పడిపోవడానికి వరద నీరు భూమిలోకి ఇంకకుండా ఖాళీ ప్రదేశాలను సిమెంట్‌తో కప్పేయడమే ప్రధాన కారణమని భూగర్భజల శాఖ అధికారులు చెబుతున్నారు. అడుగడుగునా రాతిపొరలతో కప్పిఉన్న హైదరాబాద్ భూగర్భంలో జలప్రవాహం జరగాలంటే ఖాళీ స్థలాల్లో నీటిని ఇంకించాలని, ఇళ్ల పైకప్పులు, రహదారులపై పడే ప్రతి చినుకును భూమిలోకి పంపించాలని కోరుతున్నారు.
నెలకు 2 కోట్లు ఖర్చు చేస్తున్నారు
లోటు వర్షాపాతం, బోరుబావులు ఎండిపోవడంతో నగరంలో క్రమంగా జలమండలి నీటి ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. గతేడాది మే నెలలో జలమండలికి 65 వేల ట్యాంకర్ల డిమాండ్ ఉంటే... ఈ ఏడాది జూన్ నాటికి లక్షా 10 వేలా ట్యాంకర్ల కోసం వినతులు వచ్చాయి. ప్రతి రోజు 20 వేల ట్యాంకర్లు పెండింగ్‌లో ఉండేవంటే పరిస్థితి ఎంత వరకు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. గచ్చిబౌలి, ఎస్సార్‌నగర్, ఎర్రగడ్డ, కూకట్ పల్లి, భాగ్యనగర్, మూసాపేట ప్రాంతాల్లో నీటి ట్యాంకర్ల కోసం నెలకు 2 కోట్ల రూపాయల వరకు ఖర్చుపెట్టారు.
ఇంకుడుగుంత ఉంటేనే ఇళ్లుకు అనుమతి
భూగర్భ జలమట్టాలు ప్రమాదకరంగా ఉన్న ఐటీ కారిడార్ ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ ప్రత్యేక కార్యాచరణకు సిద్ధమైంది. వర్షపు నీరు నిలిచే ప్రాంతాల్లో ఇంజక్షన్ బోర్ వెల్స్ ద్వారా నీటి మట్టాలను పెంచాలని భావిస్తోంది. ఇందుకోసం 47 ప్రాంతాలను గుర్తించారు. ఇంకుడుగుంతలను నిర్మించుకుంటేనే కొత్త భవనాలను అనుమతులు మంజురు చేయాలని నిర్ణయించుకున్నారు.
ప్రస్తుతం నగరంలో అందుబాటులో ఉన్న నీటినితో పోలిస్తే డిమాండ్ రెండింతలు అధికంగా ఉందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఆ దిశగా ప్రజలను చైతన్యం చేసి భూగర్భజలాలు పెంచితే నగరంలో నీటి కొరతను అధిగమించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.