ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రాన్ని వణికిస్తున్న అకాల వర్షాలు... అపార నష్టం - kadapa

రాష్ట్రంలో అకాల వర్షాలు ప్రజల్ని వణికిస్తున్నాయి. ప్రధానంగా రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో ఈదురు గాలులతో భారీ వర్షం కురింసింది. ఈ వానల ధాటికి పలుచోట్ల ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులతో అటు రైతులు... ఇటు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చాలాచోట్ల చెట్లు విరిగిపడి విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది.

రాష్ట్రాన్ని వణికిస్తున్న అకాల వర్షాలు

By

Published : Apr 21, 2019, 6:23 AM IST

రాష్ట్రాన్ని వణికిస్తున్న అకాల వర్షాలు

రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురిసిన వర్షాలు అపార నష్టాన్ని కలిగించాయి. ఎనిమిది మంది ప్రాణాల్ని బలితీసుకున్నాయి. పంటలను నాశనం చేశాయి. అమ్మడానికి ఆరబోసిన ధాన్యం తడవడంతో రైతులు ఆవేదన చెందారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో గాలి వాన కురిసింది. గంటపాటు ఎడతెరిపి లేకుండా... ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులు వీయడంతో వెంకటగిరి దక్షిణ వీధిలో చెట్లు కూలి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి.

కర్నూలు, ప్రకాశం జిల్లాల సరిహద్దుల్లో నల్లమల అడవుల్లో భారీ వర్షం కురిసింది. నంద్యాల-గిద్దలూరు రహదారిపై రెండడుగుల మేర నీరుపారాయి. వర్షం నీటితో రహదారిపై పారే నీటితో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

కడప జిల్లాలో భారీ వర్షం కురిసింది. రైల్వేకోడూరులో భారీ వర్షంతో ప్రధాన రహదారిలో మోకాలు లోతు వర్షపు నీరు నిలిచింది. వర్షం కారణంగా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. రైల్వేకోడూరు మండలం అనంతరాజుపేటలో పిడుగుపాటుకు చెట్టు దగ్ధమైంది.

కడప, రాయచోటి, గాలివీడు, ఒంటిమిట్ట ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడింది. ఒంటిమిట్టలో గాలివానకు ఆలయం వద్ద 7 విద్యుత్‌ హోర్డింగ్‌లు కూలాయి. ఒంటిమిట్ట మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. బద్వేల్‌లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం కురిసింది. సిద్దవటం మార్గంలో వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈదురుగాలులకు పలుచోట్ల స్తంభాలు కూలడంతో... విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

ప్రకాశం జిల్లాలో కురిచేడు మండలం పెద్దారంలో భారీగా ఈదురుగాలులు వీచాయి. పమిడిపాడు బ్రాంచ్‌ కాలువ వద్ద చెట్టు విరిగి మీద పడి వ్యక్తి మృతి చెందాడు. విశాఖ జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. అక్కయ్యపాలెం, తాటిచెట్లపాలెం, మద్దిలపాలెంలో, గాజువాక, ఎంవీపీ కాలనీ, శివాజీపాలెం ప్రాంతాల్లో వర్షం పడింది.

అనంతపురం జిల్లాలో అకాల వర్షం రైతులను నిలువునా ముంచింది. తీవ్ర వర్షాభావం, కరవు పరిస్థితుల్లో పండ్ల మొక్కలను కాపాడుకున్న రైతులను అకాల వర్షం, పెనుగాలి ఒక్కరోజులోనే తీవ్ర నష్టానికి గురిచేసింది. జిల్లా వ్యాప్తంగా 125 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లగా... సుమారు కోటిన్నర రూపాయల వరకు ఆర్థికంగా నష్టం జరిగింది.

ABOUT THE AUTHOR

...view details