రైతు భరోసా పథకాన్ని మొదటి ఏడాది నుంచే అమలు చేయాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. అన్నదాతలకు పెట్టుబడి సాయంగా అందించే 12వేల 500 రూపాయలను అక్టోబర్ 15 నుంచే అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల హామీల్లో నవరత్నాల్లో ఒకటైన ఈ పథకాన్ని కౌలు రైతులకూ వర్తింప చేయనుంది. వ్యవసాయం, అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. 62 శాతం మంది వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఆధారపడుతున్నప్పుడు... వారికి కావాల్సినవి ప్రభుత్వం చేయకపోతే ఉపయోగం ఏంటని జగన్ ప్రశ్నించారు.
ప్రతి పంటకూ మద్దతు ధర...
కనీస మద్దతు ధర సంపూర్ణంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 3వేల కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధిని బడ్జెట్లో పెడతామని జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని రద్దు చేశారు. పంట బీమా కోసం రైతులు ఒక్కపైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదని సీఎం తెలిపారు. నకిలీ విత్తనాలపై తీవ్రంగా స్పందించిన సీఎం... అక్రమార్కులను కఠినంగా శిక్షించాలని, జైలుకు పంపడానికి కూడా వెనుకాడొద్దన్నారు.
గ్రామ సచివాలయాలు... వ్యవసాయ కేంద్రాలు!
అక్టోబర్ 2న ప్రారంభమయ్యే గ్రామ సచివాలయాలు వ్యవసాయ అవసరాలకు కేంద్రంగా ఉంటాయని ముఖ్యమంత్రి అన్నారు. విత్తనాలు, ఎరువులు, మందులను గ్రామ వలంటీర్లు నేరుగా రైతులకే అందిస్తారని తెలిపారు. పంటలకు మద్దతు ధర, ఇతర అంశాలపై సిఫార్సులు చేయడానికి వ్యవసాయ మిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు జగన్ ప్రకటించారు. వ్యవసాయ ఉత్పత్తులు రైతుకు, వినియోగదారునికి ప్రయోజనకారిగా ఉండాలని, ఇందుకోసం పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖలను అనుసంధానించనున్నట్టు పేర్కొన్నారు. దళారుల పట్ల కఠినంగా ఉండాలని సూచించారు.
అసెంబ్లీ నియోజకవర్గానికో రిగ్గు...
ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓ రిగ్గు బోర్లు వేసుకునేందుకు అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నియోజకవర్గం యూనిట్‌గా పంటల నిల్వకు ఓ శీతల గిడ్డంగి, మరో సాధారణ గిడ్డంగి ఏర్పాటు చేయాలన్నారు. సహకార రంగంలో చక్కర ఫ్యాక్టరీలను పునరుద్ధరించే చర్యలు చేపట్టాలని, డెయిరీలకు పాలు సరఫరా చేసే రైతులకు లీటరుకు 4రూపాయల బోనస్ చెల్లించాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. ప్రమాదవశాత్తు చనిపోయిన లేదా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు వైఎస్‌ఆర్ బీమా కింద 7లక్షల సహాయం అందించాలన్నారు. కౌలు రైతులను గుర్తించేందుకు ప్రత్యేక కార్డు జారీ చేయాలని చెప్పారు. ఎన్నికల ప్రణాళిక.....ప్రభుత్వ పాలనకు దిక్సూచిలా ఉంటుందన్న సీఎం జగన్....కర్నూల్‌లో ఏర్పాటు చేసే మెగా సీడ్ ప్రాజెక్ట్‌తోపాటు గతంలో అమలు చేసిన వివిధ పథకాలను పునః సమీక్షించాలని ప్రభుత్వం ముఖ్య సలహాదారు అజేయ కల్లంకు సూచించారు.
ఇదీ చదవండీ: జగన్ కేబినెట్లో 45శాతం మంత్రి పదవులు వారికే!