ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతులకు శుభవార్త.. రూపాయికే పంటల బీమా! - good news to farmers

వైఎస్సార్​ ఉచిత పంటల బీమా పథకంలో భాగంగా రైతులు నామమాత్రంగా రూపాయి చెల్లించి నమోదు చేయించుకుంటే ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే ఉచితంగా చెల్లించబోతోంది. దీని కోసం సొంతంగా వ్యవసాయ పంటల బీమా సంస్థనే ప్రారంభించబోతోంది.

రైతులకు శుభవార్త.. రూపాయికే పంటల బీమా!

By

Published : Jul 15, 2019, 6:17 AM IST

వైఎస్సార్​ ఉచిత పంటల బీమా పథకాన్ని ఈ ఖరీఫ్​ నుంచే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాగయ్యే ప్రతి ఎకరానికి ప్రీమియం చెల్లించేందుకు నిధులు కూడా అందుబాటులో ఉంచబోతోంది. బ్యాంకుల్లో పంట రుణాలున్న వారితోపాటు.. రుణాలు పొందని రైతులు కూడా నామమాత్ర రుసుము చెల్లించి నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. బ్యాంకుల ద్వారా బీమా ప్రీమియం చెల్లించే వారికి ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించే ఏర్పాట్లు చేస్తోంది. రబీ నాటికి రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా వ్యవసాయ బీమా సంస్థ ఏర్పాటు చేయబోతోంది. ఈ మేరకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. సర్కార్​ చర్యల నేపథ్యంలో రాష్ట్రంలో పంటల బీమా పథకం రూపురేఖలే మారిపోనున్నాయి.

మీ సేవా కేంద్రాల్లో..
ఈ ఏడాది ఖరీఫ్​లో 42.04 లక్షల హెక్టార్లలో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా. వాస్తవ పంటల సాగు ఎంత ఉంటే అంతకు బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. పంట రుణాలు తీసుకోని రైతులు మీ-సేవా కేంద్రాల ద్వారా నామమాత్రంగా ఒక రూపాయి చెల్లించి నమోదు చేసుకుంటే సరిపోతుంది. రైతు వాటాను వ్యవసాయశాఖ జమ చేస్తుంది. సాగుదారు రూపాయి చెల్లించి పేరు, సాగు చేసిన పంట, విస్తీర్ణం, భూమి వివరాలు నమోదు చేయించుకుంటే చాలు. రాష్ట్రమే సొంతంగా బీమా సంస్థను ఏర్పాటు చేస్తే ఇతర బీమా సంస్థల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన ఆగత్యం ఉండదు. పరిహారం విడుదలపై నిర్ణయం సర్కార్​ చేతిలోనే ఉంటుంది.

తిరిగి చెల్లింపు..
రైతులు ఏప్రిల్​, మే నెలల నుంచే బ్యాంకుల్లో కొత్త రుణాలు తీసుకోవడం, పాత రుణాలకు వడ్డీలు చెల్లించి కొత్తవాటిగా మార్చుకోవడం ప్రారంభించారు. వీరందరి నుంచి పంటల వారీగా ప్రీమియం రుసుమును బ్యాంకులు మినహాయించుకున్నాయి. ఇప్పుడు ఆ మొత్తాన్ని బ్యాంకులవారీగా ప్రభుత్వం తిరిగి జమ చేయనుంది.

ABOUT THE AUTHOR

...view details