రాజకీయ పార్టీల ఆధిపత్య పోరుతో హింసాత్మక ఘటనలు జరిగాయి. ప్రత్యర్థుల దాడుల్లో ఇద్దరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మృత్యువాతపడ్డారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వీరాపురం వద్ద పోలింగ్ కేంద్రంలో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో తెలుగుదేశం పార్టీకి చెందిన చింతా భాస్కర్‌రెడ్డి కుప్పకూలిపోయాడు. చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం టి.సదుం వద్ద తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. ఇరువర్గాలుగా విడిపోయిన కార్యకర్తలు దాడి చేసుకోవటంతో ఘటనలో వృద్ధుడు మృతి చెందాడు. గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం ఇనిమెట్లలో సభాపతి కోడెల శివప్రసాదరావును వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయనపై దాడి చేసి.. చొక్కా చించేశారు. కారు ధ్వంసం చేశారు. వైకాపా కార్యకర్తల దాడిలో సభాపతి అనుచరులు ముగ్గురు గాయపడ్డారు. నరసరావుపేట తెదేపా అభ్యర్థి అరవిందబాబుపై వైకాపా నేతలు..దాడి చేయగా.. చేయి విరిగిపోయింది.
ఈసీ తీరును నిరసిస్తూ మంత్రి లోకేశ్ చేసిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. ఎన్నికల సంఘం ఓటర్లకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదంటూ.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం క్రిస్టియన్ పేటలోని 37వ పోలింగ్ కేంద్రం వద్ద లోకేశ్ ధర్నాకు దిగారు. పోలింగ్ కేంద్రం వద్ద ధర్నా చేయడాన్ని నిరసిస్తూ... వైకాపా నేతలు ఆందోళన చేశారు. ఇరువర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణ నెలకొంది. వైకాపా వర్గం ముందుకు దూసుకురావడంతో స్వల్ప లాఠీఛార్జీ చోటు చేసుకుంది. ఎస్పీ సూచన మేరకు లోకేశ్ ధర్నా విరమించి.. పోలింగ్ కేంద్రం బయటకు వచ్చారు. ఓటమిని జీర్ణించుకోలేకే వైకాపా రాష్ట్రవ్యాప్తంగా దాడులకు పాల్పడిందని లోకేశ్ ట్వట్టర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుంటూరులోని నల్లచెరువులో పోలింగ్ కేంద్రం వద్ద అధికార, ప్రతిపక్ష కార్యకర్తల ఆందోళన లాఠీ ఛార్జీకి దారితీసింది. ఎన్నికల సిబ్బంది వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ తెదేపా శ్రేణులు ఆరోపించారు. అదే సమయంలో తెదేపా ఎంపీ అభ్యర్ధి గల్లా జయదేవ్ అక్కడికి చేరుకున్నారు. ఆయన లోపలికి వెళ్లి ఎన్నికల అధికారులతో మాట్లాడుతుండగా.. తెదేపా శ్రేణులు ధర్నా చేపట్టాయి. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున పోలీసు బలగాలు అక్కడికి చేరుకొని 2 పక్షాల కార్యకర్తలను చెదరగొట్టారు. లాఠీ ఛార్జీలో 2 పార్టీల కార్యకర్తలకు గాయాలయ్యాయి. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఉదయం నుంచీ ఉద్రిక్తత కొనసాగింది. 143వ పోలింగ్ బూత్ విషయమై.. భూమా, గంగుల వర్గాల మధ్య వివాదం జరిగింది. పోలింగ్ సమయం ముగిసినా ఓటర్లును తెస్తున్నారంటూ మంత్రి భూమా అఖిలప్రియ, మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఇరువురూ వాగ్వాదానికి దిగటంతో కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు. ఘటనలో ఆర్టీసీ బస్సు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పోలీసులు గాల్లోకి భాష్పవాయుగోళాలు ప్రయోగించి... పరిస్థితి సద్దుమణిగేలా చేశారు.
దాడులు... ప్రతిదాడులతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం రణరంగంలా మారింది. ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వాహనంపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు. సమాచారం తెలుసుకున్న జలీల్ ఖాన్ మద్దతుదారులు ప్రతిదాడికి పాల్పడ్డారు. పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని శాంతింప చేశారు. విజయవాడలోని ప్రసాదంపాడులో తెదేపా, వైకాపా ఘర్షణతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమయం ముగిసినా ఓటింగ్ కు అనుమతిస్తున్నారంటూ గొడవపడ్డారు. తెదేపా, వైకాపా వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. మహిళలను పోలీసులు దుర్భాషలాడారంటూ తెదేపా ఏజెంట్లు ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఫిర్యాదు చేశారు. దురుసు ప్రవర్తనపై ఎమ్మెల్యే పోలీసులను నిలదీశారు. తిరుపతి గ్రామీణ పరిధిలోని రామానుజపల్లెలో ఉద్రిక్తత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ సమయం ముగిసినా ఓటు వేసేందుకు అనుమతించాలని వైకాపా నేతలు పట్టుపట్టారు. తెదేపా శ్రేణులూ అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు తోపులాటకు దిగడంతో.. పోలీసులు చెదరగొట్టారు. తనపై చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ పులివర్తి నాని సతీమణి గానసుధ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు.