ఎన్నికల ప్రచారంలో సామాజిక మాధ్యమాలతో పాటు ఇతర వేదికలపై రాజకీయ పార్టీలు పరస్పరం చేసుకుంటున్న విద్వేష పూరిత ప్రకటనలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఓటర్లను భయాందోళనలకు గురిచేసేలా ఉండటం వలన ఈసీ ఈ నిర్ణయానికి వచ్చింది. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకూ నోటీసులు జారీ చేసిన ఎన్నికల సంఘం... వారిచ్చిన సమాధానాలను పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకోనుంది. ప్రత్యేకించి కులమతాలపై విద్వేష పూరిత ప్రకటనలు సరికాదని భావిస్తున్న ఈసీ రాజకీయ పార్టీలపై నేరుగా కేసులు నమోదు చేయనుంది. ఈ ప్రకటనలపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 153ఏ తో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టం లోని సెక్షన్ 125 ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు.
ఏ పెన్నుతో అయినా సంతకం చేయవచ్చు
మరోవైపు నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్ధులు సమర్పించే బి-ఫాంపై ఏ పెన్నుతో సంతకం చేసినా అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ విషయంలో కొందరు రిటర్నింగ్ అధికారులు గందరగోళానికి గురైయ్యారని ఆయన అన్నారు. నీలి, నలుపు రంగుల పెన్నులతో అభ్యర్థులు అఫిడవిట్లు, బి-ఫాంపై సంతకం చేసుకునే వీలుందని ద్వివేది వివరించారు. నామినేషన్లను ఆమోదించటంలో రిటర్నింగ్ అధికారే నిర్ణయమే కీలకమని ఆయన స్పష్టం చేశారు. రిటర్నింగ్ అధికారి వద్ద ఏదైనా తప్పుదొర్లితే నేరుగా హైకోర్టును ఆశ్రయించాల్సిందేనని తెలిపారు.
ఇవీ కూడా చూడండి