ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫొని తుపానుపై అధికారులతో సీఎస్ సమీక్ష - ఫొని తుపాను

బంగాళాఖాతంలో ఫొని తుపాను గమనంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. ఉన్నతాధికారులతో సమీక్షించారు. సహాయక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఫొని తుపానుపై అధికారులతో సీఎస్ సమీక్ష

By

Published : May 1, 2019, 9:38 PM IST

ఫొని తుపానుపై అధికారులతో సీఎస్ సమీక్ష

ఫొని తుఫాను ఈ నెల 3న ఒడిశాలోని గోపాల్ పూర్ - చాంద్‌బలీల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్రం అప్రమత్తమైంది. ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులు అనుక్షణం తుపాను గమనాన్ని తెలుసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశాలు జారీ చేశారు. వివిధ విభాగాల ఉన్నతాధికారులతో కలిసి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి.. తదితర కోస్తా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో తాజా పరిస్థితిని సమీక్షించారు.

సహాయ చర్యల పర్యవేక్షణకు ముగ్గురు ఐఏఎస్​లు

ఫొని తుపానుతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో గురు, శుక్ర‌వారాల్లో తీరప్రాంతం వెంబడి గంటకు 90 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు, భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు ప్రజల రక్షణ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. 3వ తేదీ వరకూ మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా చూడాలన్నారు. తుపాను సహాయ చర్యల పర్యవేక్షణకు ముగ్గురు ఐఏఎస్ అధికారులను నియమించారు. ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. తాగునీటి వనరులకు, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే సకాలంలో సమస్య పరిష్కరించేందుకు అవసరమైన జనరేటర్లను, ట్యాంకర్లను అందుబాటులో ఉంచాలన్నారు. తుపాను ప్రభావిత మండలాల్లో సైక్లోన్ షెల్టర్లను ఏర్పాటు చేసి అవసరమైన సౌకర్యాలను కల్పించాలని సీఎస్ ఆదేశించారు. ప్రజలకు నిత్యావసరాలు అందేలా చూడాలన్నారు. ప్రభావిత మండలాల్లో కమ్యునికేషన్ వ్యవస్థ ఉండేలా శాటిలైట్ ఫోన్లను అందుబాటులో ఉంచాలని దిశానిర్దేశం చేశారు.

సిద్ధంగా రెస్క్యూ బృందాలు

విద్యుత్ అంతరాయం కలిగితే తక్షణ పునరుద్ధరణ కోసం ప్రతి విద్యుత్ ఉపకేంద్రం పరిధిలో 500 విద్యుత్ స్తంబాలు, 2 జేసీబీలు, ఇతర సామగ్రి అందుబాటులో ఉంచుతున్నట్టు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లాల్లో 6 వేల సోలార్ లాంతర్లు పంపిణీ చేస్తున్నామన్నారు. టవర్లు దెబ్బతింటే 48 గంటల్లో పునరుద్ధరించే ప్రక్రియ కింద 800 మంది సభ్యులతో కూడిన అత్యవసర రెస్క్యూ బృందాలను అందుబాటులో ఉంచుతున్నట్లు ట్రాన్స్​ కో ఎండీ విజయానంద్ తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లోని అన్ని మున్సిపాలిటీల్లో తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
తుపాను అప్రమత్తతపై మండలాల వారీగా అలర్ట్ బులిటెన్లు జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు ఆర్టీజీఎస్ సీఈఓ బాబు స్పష్టం చేశారు. 70వేల ఫోన్ కాల్స్ ద్వారా ప్రజల అప్రమత్తం చేశామని వెల్లిడించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బది లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయా శాఖల అధికారులు సీఎస్​కు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details