ఐదేళ్లలో 1166 మంది రైతులు మరణిస్తే, 420 మందికి మాత్రమే పరిహారం అందిచారని వైకాపా ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి ఆరోపించారు. మిగిలిన వారికి ఎందుకు పరిహారం ఇవ్వలేదని తెదేపాని నిలదీశారు.
"రైతు ఆత్మహత్యలకు తెదేపాదే బాధ్యత" - farmers
శాసన మండలిలో రైతు ఆత్మహత్యలపై వాడీవేడి చర్చ జరిగింది. రైతు మరణాలకు తెలుగుదేశం పార్టీదే బాధ్యతని వైకాపా ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి ఆరోపించగా... తెదేపా ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ఖండించారు. రైతు సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలను మంత్రి బొత్స వివరించారు.
తమకు అందిన నివేదికల ప్రకారం అందరికీ... పరిహారం చెల్లిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తెదేపా తీరుతోనే రైతులు అఘాయిత్యాలు చేసుకున్నారని ఆరోపించారు.
మంత్రి బొత్స, ఎమ్మెల్సీ గోపాల్ రెడ్డి వ్యాఖ్యలను తెదేపా ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ఖండించారు. రైతు ఆత్మహత్యల నివారణకు ప్రస్తుత ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో... తెలపాలన్నారు. చనిపోయిన తర్వాత డబ్బులిస్తామని ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు. ప్రభుత్వ అసమర్థతను... గత తెదేపా ప్రభుత్వంపై నెట్టాలని చూస్తున్నారని చెప్పారు.