ఉత్తరాంధ్రలో వర్షాలు...
ఫొని తుపాను కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా తేలికపాటి జల్లులు పడ్డాయి. కంచిలిలో అత్యధికంగా 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సోంపేటలో గరిష్ఠంగా 10, బాతాపురం ఎగువ 7.6, ఎంఎస్‌పల్లి 7.6, సోంపేట 7.45, ఇచ్ఛాపురం 7.22, బాతుపురం దిగువ ప్రాంతంలో 6.9 సెంటీమీటర్లు నమోదైంది. టెక్కలి ఎన్టీఆర్ నగర్‌లో చలిగాలులకు ఓ వృద్ధురాలు మృతిచెందింది.
ఫొని ప్రభావంతో విజయనగరం జిల్లా తెర్లాం, మెరకముడిదాం, గుర్ల, గరివిడి, డెంకాడ, నెల్లిమర్లలో గాలుల తీవ్రత పెరిగింది. భోగాపురం, పూసపాటి రేగ మండల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. తీరప్రాంతాల్లో సముద్రపు కెరటాలు ఎగిసిపడ్డాయి. విశాఖ జిల్లాలో తుపాను ప్రభావంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి.
ఫొని మహోగ్ర రూపం...
ఫొని తుపాను మహోగ్ర రూపంతో తీరంలో ప్రచండ గాలులు విరుచుకుపడ్డాయి. శ్రీకాకుళం జిల్లాలో భీకర స్థాయికి చేరాయి. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. గాలులకు అనేక చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వజ్రపుకొత్తూరు మండలం భావనపాడు వద్ద సముద్రం 10 కిలోమీటర్లు ముందుకు వచ్చింది. గార మండలం బందరవానిపేటలో అలలు ఎగిసిపడ్డాయి.
పునరావాస కేంద్రాల ఏర్పాటు...
శ్రీకాకుళంలో 126కిపైగా పునరావాస కేంద్రాల ఏర్పాటు చేశారు. 20 వేల మందికి అధికారులు భోజన ఏర్పాట్లు చేశారు. తాగునీటితో పాటు విద్యుత్ జనరేటర్లు, అత్యవసర మందుల అందుబాటులో ఉంచారు. జిల్లాకు 9 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకొని సేవలందించాయి. వంద మంది వైద్య నిపుణులు, 825 మంది పారామెడికల్ సిబ్బంది ప్రజాసేవలో పాల్గొన్నారు. విద్యుత్ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదమున్నందున 10 వేల స్తంభాలను అధికారులు సిద్ధం చేశారు. అత్యవసరంగా వినియోగించేందుకు 6,800 సౌర విద్యుత్ ల్యాంపులు ఏర్పాటు చేశారు. కలెక్టర్ నివాస్, జేసీ చక్రధర్ కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.
ముందుజాగ్రత్త చర్యలు...
ఫొని కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా... అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. చాలాచోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఫొని గమనాన్ని పరిశీలిస్తున్న ఆర్టీజీఎస్ సహకారంతో... చాలావరకు ఆస్తి నష్టాన్ని తగ్గించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి.
ట్రాన్స్‌కో అధికారుల విజ్ఞప్తి...
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల ప్రజలకు తూర్పు ట్రాన్స్‌కో అధికారులు విజ్ఞప్తి చేశారు. తుపాను ప్రభావంతో కూలిన స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల గురించి సమాచారం అందించేందుకు టోల్ ఫ్రీ నంబరు 1912 ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం కమాండ్ కంట్రోల్ కేంద్రానికి 9490612633, విజయనగరం కమాండ్ కంట్రోల్ కేంద్రానికి 9490610102, విశాఖ కమాండ్ కంట్రోల్ కేంద్రానికి 7382299975 నంబర్లను ఏర్పాటు చేశారు.