విద్యావ్యవస్థ ప్రక్షాళనకు కమిటీ ఏర్పాటు - committee appointed for change eduacation system
విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీనికి సంబంధించి 12 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఫీజుల నియంత్రణకు చట్టం తేవాలని సీఎం చెప్పిన కొన్ని గంటల్లోనే ఇది ఏర్పాటు కావడం విశేషం.
రాష్ట్రంలోని విద్యా విధానంలో సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌కు చెందిన ప్రొఫెసర్ బాలకృష్ణన్ ఛైర్మన్‌గా 12 మంది సభ్యులతో కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పాఠశాల, కళాశాల స్థాయిలో ప్రస్తుత విద్యావిధానంలో మార్పులు, సంస్కరణలపై ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణపైనా సూచనలు చేయనుంది.
నాలుగు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షక కమిటీ ఏర్పాటు కోసం శాసన సభ ద్వారా ఒక చట్టం తీసుకుని రావాలని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించిన కొద్దిగంటల్లోనే ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కేంద్ర ప్రభుత్వ చట్టానికి లోబడి విద్యాహక్కును అమలు చేయాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. విద్య ధనార్జన కోసం కాకుండాఒక సేవగా ఉండాలని.... అందుకు అనుగుణంగానే వ్యవస్థలో మార్పులు జరగాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం నిపుణుల కమిటీని నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు వెలువరించింది