వీవీ ప్యాట్ స్లిప్పులు దొరకటంపై స్పందించిన ద్వివేది
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో దొరికిన వీవీ ప్యాట్ స్లిప్పుల ఘటనపై ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది స్పందించారు. దొరికిన స్లిప్పులు పోలింగ్ రోజువి కాదని అన్నారు. ఎవరో ఉద్యోగి ఉద్దేశపూర్వకంగానే ఈ స్లిప్పులను బయటపడేసి ఉంటారనే అనుమానం వ్యక్తం చేశారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో బయటపడిన వీవీ ప్యాట్ స్లిప్పుల ఘటనపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది స్పందించారు. దొరికిన స్లిప్పులు పోలింగ్ రోజువి కాదని స్పష్టం చేశారు. ఆత్మకూరు పాఠశాల కేంద్రం కేవలం ఈవీఎంల కమీషనింగ్ సెంటర్ మాత్రమే అని అన్నారు. పోలింగ్‌కు ముందు వెయ్యి ఓట్లను బెల్ ఇంజినీర్లు పోల్ చేశారని,.. ఈవీఎంలు సరిగా పని చేస్తున్నాయని నిర్ధారించాకే కేంద్రాలకు తరలించామని తెలిపారు. ఎవరో ఉద్యోగి ఉద్దేశపూర్వకంగా ఈ స్లిప్పులను బయటపడేసి ఉంటారనే అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఉద్యోగులు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు.