"ఏపీతో స్నేహం... ఇరువురికీ లాభదాయకం" - పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు
ఏపీతో స్నేహపూర్వకమైన, ప్రేమపూర్వకమైన, ఉల్లాసభరితమైన సంబంధం కొనసాగుతుందని తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలిపారు. తెలంగాణ మంత్రివర్గ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలను కేసీఆర్ మీడియాకు వివరించారు.
ఇటీవల జరిగిన పరిణామాలతో తెలుగు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం ఏర్పడిందన్నారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో కొనసాగించాల్సిన సంబంధాలు.. రాబట్టాల్సిన ఫలితాలు.. తద్వారా రాష్ట్ర పురోగతికి దోహదపడే అంశాలపై కేబినెట్‌లో విస్తృతంగా చర్చించినట్టు సీఎం వెల్లడించారు. గత ప్రభుత్వాల హయాంలో సాగునీటి ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంత త్వరగా పూర్తి కావడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. తాము కోరిన వెంటనే ఏపీలో నూతన ప్రభుత్వం ఎలాంటి భేషజాలు లేకుండా ప్రభుత్వ కార్యాలయాలు అప్పగించటం హర్షణీయమని కొనియాడారు. ఇలాంటి సంబంధాలనే ఎల్లకాలం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.