తాడేపల్లిలోని తన నివాసంలో.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ప్రధాన శాఖాధిపతులతో సమీక్షించారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, విద్య, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, విద్యుత్, వ్యవసాయ, సెర్ప్ , రెవెన్యూ, ఆర్థిక, పురపాలక, వైద్య శాఖాధిపతులు పాల్గొన్నారు. బడ్జెట్లో వివిధ శాఖలకు కేటాయించిన నిధులపై సీఎం సమగ్రంగా తెలుసుకున్నారు. ఇప్పటికే పలు హామీల అమలు ప్రారంభించినందున.. నిధుల కొరత రాకుండా కేటాయింపులు ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ మేరకు కీలక మార్పులు సూచించినట్లు తెలిసింది.
సంక్షేమానికే ప్రాధాన్యం.. నిధుల కొరత రానివ్వకండి: సీఎం - తెదేపా ప్రభుత్వం
ఈ నెల 11 నుంచి శాసన సభ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన శాఖల అధిపతులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష జరిపారు. నవరత్నాలు సహా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు కోసం శాఖల వారీగా కేటాయింపులపై చర్చించారు.
శాసనసభలో ప్రవేశ పెట్టనున్న ముసాయిదా బిల్లులపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. గత ప్రభుత్వంలో జరిగిన కేటాయింపులు సహా పాలనపై శాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించారు. శాసనసభలోనే వీటిని విడుదల చేసే అవకాశాలున్నాయి. సమావేశాలు ప్రారంభమయ్యేలోపు అందరూ శ్వేతపత్రాలతో సిద్ధంగా ఉండాలని సీఎం సూచించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు.. బుధవారం ఉదయం 11 గంటలకు అన్ని శాఖాధిపతులతో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం సచివాలయంలో సమావేశం కానున్నారు. తదుపరి చర్యలపై సమీక్షించనున్నారు.