సీఆర్డీఏ అధికారులతో జరిపిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఆర్డీఏపై సీఎం జగన్ సమారు 3 గంటలపాటు సుదీర్ఘంగా సమీక్షించారు. రాజధాని ప్రకటనకు ముందు జరిగిన భూ రిజిస్ట్రేషన్లు పరిశీలించారు. రాజధాని ప్రకటన అనంతరం భూసేకరణ ప్రక్రియ సహా స్థలాల కేటాయింపు, రైతులకు పరిహారం తదితర అంశాలపై చర్చించారు. మాస్టర్ ప్లాన్, ఇతర భవన నిర్మాణాల నమూనాను పరిశీలించారు.
రాజధాని నిర్మాణంలో సింగపూర్ సహా... ఇతర దేశాల ప్రతినిధులతో కుదుర్చుకున్న ఒప్పందాలు పరిశీలించారు. వాటిలో లోపాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సచివాలయం, ఇతర భవనాల టెండర్ల ప్రక్రియలో లోపాలు గుర్తించినట్లు... మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రాజధాని వ్యవహారంలో పెద్ద కుంభకోణం ఉందన్న బొత్స... విచారణ ముగిశాకే రాజధాని నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకోవడాన్ని తమ ప్రభుత్వం అంగీకరించబోదన్న మంత్రి... బలవంతంగా లాక్కున్నారని ఎవరైనా వస్తే వారి భూమి తిరిగి ఇచ్చేందుకు సిద్ధమని స్పష్టం చేశారు.