నిబద్ధత, నీతి, నిజాయితీ అనే మూడు అంశాల ప్రాతిపదికన పోలీసు బదిలీలు చేశామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్ఘాటించారు. ఏ రాజకీయ పార్టీవైపు మొగ్గు చూపకుండా తటస్థంగా ఉన్న అధికారులను ఎస్పీలుగా నియమించామని వివరించారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ... పోలీసులకు వారాంతపు సెలవులు ఇవ్వడం లేదని గుర్తు చేశారు. ఒక్కరోజు కుటుంబంతో గడిపితే ప్రజల పట్ల పోలీసుల వ్యవహార శైలి మారుతుందనే వారాంతపు సెలవులు ఇచ్చామని స్పష్టం చేశారు. ప్రజలతో కఠినంగా వ్యవహరించొద్దని ఆదేశించారు.
క్షేత్రస్థాయిలో ఉన్న పోలీసుల వ్యవహారశైలిపై ఎప్పటికప్పుడు ప్రజలు, బాధితుల నుంచి ఎస్పీలు వివరాలు సేకరించాలని సూచించారు. అవినీతిపరులైతే వారిని పక్కన పెట్టి... వ్యవస్థను మార్చే ప్రయత్నం చేయాలని ఆదేశించారు. సైబర్క్రైంను ఎదుర్కోవడంలో పోలీసు విభాగం సమాయత్తం కావాలని జగన్ సూచించారు. మహిళలపై అఘాయిత్యాలు, నేరాలు నియత్రించలేకపోతే... విధుల్లో విఫలం ఆయినట్లేనని వ్యాఖ్యానించారు. అధికార పార్టీ నేతలు చేసే సిఫార్సులనూ అంగీకరించొద్దని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు.