హైదరాబాద్ తెలంగాణకు వెళ్లడం వల్ల ఏపీ బాగా నష్టపోయిందన్న సీఎం జగన్... ఏపీ కేవలం వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మిగిలిందని వివరించారు. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం చాలా తక్కువని... ఈ నష్టం పూడ్చేందుకే ఆనాటి కేంద్రప్రభుత్వం హోదా హామీని ఇచ్చిందని గుర్తుచేశారు. హోదా హామీని అప్పటి అధికార, విపక్ష పార్టీలు నిలబెట్టుకోలేదని పేర్కొన్నారు.
2014లో రూ.97 వేల కోట్లున్న అప్పు... నేటికి 2.59 లక్షల కోట్లకు చేరిందని ముఖ్యమంత్రి జగన్ నీతిఆయోగ్ సమావేశంలో చెప్పారు. అసలు, వడ్డీ కలిపి ఏడాదికి రూ.40 వేల కోట్ల భారం ఏపీపై పడుతోందన్న సీఎం... ఏపీలో ఉపాధి కల్పన అవకాశాలు దారుణంగా పడిపోయాయని వివరించారు. ఏపీలోని యువత వలసలు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. హోదా మాత్రమే రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని కొంతవరకు పూడ్చగలదని స్పష్టం చేశారు.
14వ ఆర్థికసంఘం సూచన ఆధారంగా హోదా ఇవ్వబోరనే వదంతులు వచ్చాయన్న సీఎం జగన్...హోదా రద్దుకు సిఫారసు చేయలేదని 14వ ఆర్థికసంఘం సభ్యుడే పేర్కొన్న విషయం గుర్తుచేశారు. ఆ సభ్యుడు అభిజిత్ సేన్ రాసిన లేఖనూ మీకు అందిస్తున్నాని అన్నారు. ప్రత్యేక హోదా వల్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా వచ్చే మొత్తం పెరుగుతుందని జగన్ వివరించారు. హోదా వల్ల పారిశ్రామిక రాయితీలు, పన్ను రాయితీలు వస్తాయన్న ముఖ్యమంత్రి... ఉద్యోగ కల్పన పెరిగి నిరుద్యోగ సమస్య పరిష్కరించే అవకాశం వస్తుందని చెప్పారు.