వైకుంఠపురం ప్రాజెక్టుకు నేడు సీఎం శంకుస్థాపన వైకుంఠపురం ప్రాజెక్టుకు నేడు సీఎం శంకుస్థాపనశరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాజధాని ప్రాంతంలో తాగునీటి సమస్య, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కృష్ణా నదిపై మరో ప్రాజెక్టు నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. గుంటూరు జిల్లా వైకుంఠపురం వద్ద నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు నేడు శంకుస్థాపన చేయనున్నారు. 10 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల ఈ బ్యారేజ్ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 2 వేల 169 కోట్లు కేటాయించింది. కేవలం సాగు, తాగు నీటి అవసరాలకే కాకుండా జల రవాణా, పర్యటక అభివృద్ధి లక్ష్యంగా ఈ నిర్మాణాన్ని ఏర్పాటుచేయనుంది. కృష్ణా నదిపై ఉన్న పులిచింతల, ప్రకాశం బ్యారేజ్‌ల మధ్య ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. గుంటూరు జిల్లా దాములూరు-వైకుంఠపురం వద్ద నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుతో రాజధాని పరిసర ప్రాంతాల్లో తాగు నీటి సమస్య, కృష్ణా జిల్లా నందిగామ, గుంటూరు జిల్లా పెదకూరపాడు ప్రాంతాలకు సాగునీటి సమస్యలు తీరుతాయి.
2050 నాటికి అమరావతి ప్రాంతంలో నివాసముండే వారి సంఖ్య సుమారు 35 లక్షలకు పెరగనుందన్న అంచనాల ఆధారంగా భవిష్యత్తు అవసరాల దృష్ట్యా వైకుంఠపురం బ్యారేజ్‌ను తలపెట్టింది ప్రభుత్వం.
ఈ బ్యారేజ్ నిర్మాణ భూసేకరణకు రూ.770 కోట్లు ఖర్చుపెట్టనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వైకుంఠపురం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను నవయుగ సంస్థ దక్కించుకుంది. ఏడాది కాలంలో నిర్మాణ పనులు పూర్తిచేయాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తోంది ఈ సంస్థ.
కృష్ణా నదిపై ఉన్న పులిచింతల-ప్రకాశం బ్యారేజ్ మధ్య సుమారు 90 కిలోమీటర్ల వరకూ మరో ప్రాజెక్టు లేకపోవడం వలన వరదల సమయంలో ముంపు సంభవిస్తుంది. ఈ సమస్యను అధిగమించడానికి వైకుంఠపురం ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. వైకుంఠపురం వద్ద కృష్ణా నది వెడల్పు 3 కిలోమీటర్లు మాత్రమే ఉండడం వలన..ప్రాజెక్టు నిర్మాణానికి ఈ ప్రదేశం అనువైనదని ప్రభుత్వం తెలిపింది.
68 గేట్లతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ఎగువ కృష్ణా జిల్లా వైపు 6 కిలోమీటర్లు, దిగువ గుంటూరు జిల్లా వైపు 6 కిలోమీటర్లు కరకట్ట కట్టనున్నారు. వీటితో తీరప్రాంతాలకు ముంపు సమస్య ఉండదని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ ప్రదేశానికి అతిసమీపంలో ప్రసిద్ధ అమరావతి స్థూపం, పంచారామాల్లో ఒకటైన అమరేశ్వర స్వామి ఆలయం ఉన్నాయి. వీటి సంరక్షణకు 1.3 కిలోమీటర్ల మేర గోడ నిర్మిస్తామని ప్రభుత్వం పేర్కొంది.
రాజధాని ప్రజల సాగు, తాగు నీట సమస్యను తీర్చే వైకుంఠపురం ప్రాజెక్టు శంకుస్థాపన నేడు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జరగనుంది.