నూటికి నూరు శాతం మళ్లీ మనమే గెలుస్తున్నాం: చంద్రబాబు - ap politics
అర్ధరాత్రి 12 గంటలు అవుతున్నా... ఇంకా 200 బూత్‌లలో పోలింగ్ సాగుతోందన్న చంద్రబాబు... మహిళలు ఇబ్బంది పడాలనే ఈ పరిస్థితి కల్పించారని ఆరోపించారు. కార్యకర్తలు, ప్రజలే ఇవాళ ఓటింగ్ సరళిని కాపాడారని సీఎం అభినందించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం 130స్థానాలకు పైగా తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ధీమావ్యక్తం చేశారు. ఇందులో రెండో ఆలోచన లేదని నేతలకు భరోసా ఇచ్చారు. అర్ధరాత్రి పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం... నూటికి నూరు శాతం మళ్లీ తెదేపా గెలుస్తోందని పేర్కొన్నారు. అర్ధరాత్రి వరకు విధులు నిర్వహించిన పార్టీ బూత్ ఏజెంట్లకు అభినందనలు తెలిపారు.
ఓట్ల కౌంటింగ్ వరకు ఇదే పోరాట పటిమ కొనసాగించాలని సూచించారు. స్ట్రాంగ్ రూంల వద్ద వచ్చే 40రోజులు షిఫ్టుల వారిగా కాపలా కాయాలని దిశానిర్దేశం చేశారు. ఫలితాల వరకు పూర్తి అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఓడిపోతున్నామనే భయంతో వైకాపా నేతలు, కార్యకర్తలు పలు చోట్ల విధ్వంసాలకు తెరలేపారన్న చంద్రబాబు... ఇది వారి దిగజారుడు తనానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించాలని చూసినా... ప్రజలు తెదేపా పక్షాన నిలిచారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.