జగన్ అవకాశవాద రాజకీయాలు చూసి ప్రజలందరూ విసుగు చెందారని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. అమరావతిలో వంగవీటి రాధాకృష్ణ తెదేపాలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... చరిత్ర కలిగిన కుటుంబం వంగవీటి కుటుంబమని... రాధాకృష్ణ సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తి అని కొనియాడారు. 2004లో కాపులకు రిజర్వేషన్ ఇస్తామని వైఎస్సాఆర్ మేనిఫెస్టోలో పెట్టారన్న చంద్రబాబు... కాపు రిజర్వేషన్లను రెండుసార్లు మేనిఫెస్టోలో పెట్టి కాంగ్రెస్ నెరవేర్చలేదని గుర్తుచేశారు.
'కాపులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను' - kapu
ఆత్మగౌరవాన్ని పోగొట్టుకుని జగన్ బతుకుతున్నాడని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. వైకాపా, తెరాస రెండూ ఒకటేనన్న చంద్రబాబు... వైకాపాకు ఓటు వేస్తే... కేసీఆర్కు వేసినట్లేని పేర్కొన్నారు. వంగవీటి రాధాను తెదేపాలోకి ఆహ్వానించిన చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
తాను అధికారంలోకి రాగానే కాపులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాన్న ముఖ్యమంత్రి... అగ్రవర్ణ పేదలకు కేంద్రం ఇచ్చిన 10 రిజర్వేషన్లలో కాపులకు ప్రత్యేకంగా 5 శాతం ఇస్తున్నామని చెప్పారు. విభజన చట్టంలోని అంశాలను భాజపా నిర్లక్ష్యం చేసిందన్న చంద్రబాబు...భాజపాకు లాలూచీ పడిన వైకాపా.. ప్రత్యేక హోదాను తుంగలో తొక్కిందని దుయ్యబట్టారు. జగన్ అధికారంలోకి వస్తే పోలవరం పూర్తి కాదన్నారు. హైదరాబాద్‌లోని ఆస్తుల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటా రాలేదన్న చంద్రబాబు... తెలంగాణలో అందర్నీ భయపెట్టి కేసీఆర్ రెండోసారి గెలిచారని ఆరోపించారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి తెలంగాణలో జరగలేదని చంద్రబాబు పేర్కొన్నారు.