పీపీఏల గురించి వైకాపా చేసిన విమర్శలపై తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. మంగళగిరిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ కుటుంబానికి కర్ణాటకలో విద్యుత్ సంస్థలు ఉన్నాయన్న ఆయన..అక్కడ ఎక్కువ ధరకు ఒప్పందం ఎలా చేసుకున్నారని ప్రశ్నించారు. అక్కడ తన కంపెనీకి ఎక్కువ డబ్బులు తీసుకుని లాభం చేకూర్చుకుని...ఇక్కడేమో అవినీతి అని గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు.
నిరంతరం నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని తాము ఆలోచిస్తే ఇప్పుడు ఇన్ని విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడే పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై ఉన్న ప్రేమ ఆంధ్రప్రదేశ్‌పై జగన్ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. జీఎంఆర్ ద్వారా తెలంగాణకు లబ్ధి చేకూర్చాలనేది జగన్ ఆంతర్యమని ఆక్షేపించారు. అందుకే జీఎంఆర్ కి ఇవ్వకుండా లాంకో, స్పెక్ట్రమ్‌లకు ఇచ్చామని గోలపెట్టారని విమర్శించారు.
కరెంటు కొరత నుంచి మిగులు...మా ఘనతే: చంద్రబాబు 'రాష్ట్ర ప్రయోజనాలు, భావితరాల కోసం మేం కష్టపడితే...తప్పుడు సమాచారంతో అసత్యాలను చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చేశాం...తప్పుడు సమాచారం ఇచ్చే హక్కు రాష్ట్ర అధికార బృందానికి ఎవరిచ్చారు. విద్యుత్ తక్కువ ధరకు లభించేలా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం. 5ఏళ్లలో 22.5 మిలియన్ యూనిట్లు లోటు విద్యుత్ నుంచి మిగులు విద్యుత్ సాధించాం. కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్రం సూచనల మేరకే సంప్రదాయేతర ఇంధన వనరులపై దృష్టి సారించాం. ఒప్పందాలన్నీ రేగ్యులేటరీ కమిషన్ ద్వారానే జరిగాయి. పీపీఏ లు అయ్యాక ప్రభుత్వ పాత్ర నామమాత్రమని...ప్రజలకి తెలుగుదేశం ప్రభుత్వం ధరలు పెంచినట్లు అవాస్తవాలు చెబుతున్నారు' అని చంద్రబాబు విమర్శించారు.
కరెంటు కొరత నుంచి మిగులు...మా ఘనతే: చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ ఏర్పాటు చేస్తామన్న న్యాయ కమిషన్ సాధ్యం కాదని... టెండర్ల విషయంలో జడ్జీలు జోక్యం చేసుకోరని చంద్రబాబు వెల్లడించారు. వైకాపా నాయకులు సాంకేతిక విషయాలపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, వక్రీకరించి బురద చల్లుతున్నారని ధ్వజమెత్తారు. 2021 నాటికి సాంప్రదాయేతర ఇంధనం 20శాతానికి చేరాలని చంద్రబాబు అన్నారు. కియా మోటార్స్‌కు సంబంధించి జగన్‌పై వ్యంగ్యంగా సామాజిక మాధ్యమాల్లో అనేకం ప్రచారం అవుతున్నాయని చంద్రబాబు ఎద్దేవా చేశారు.