కేంద్ర బడ్జెట్ 2019 కేటాయింపులు... ఆంధ్రప్రదేశ్ ప్రజలు, దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేవని తెదేపా అధినేత చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ రంగాల అభివృద్దికి, పేదల సంక్షేమానికి కేంద్రం ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. రాష్ట్ర ప్రజలను ఈ బడ్జెట్ తీవ్ర నిరాశకు గురి చేసిందని చెప్పారు. ప్రత్యేక హోదా అంశంతో పాటు విభజన చట్టంలోని అంశాలను పూర్తిగా విస్మరించారని ఆగ్రహించారు.
ప్రజల ఆకాంక్షలకు విరుద్ధం.. కేంద్ర బడ్జెట్: చంద్రబాబు - చంద్రబాబు
కేంద్ర బడ్జెట్‌పై రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు.
రైతులు, మహిళలు,యువతరం ఆశలను నెరవేర్చే దిశగా బడ్జెట్ లేదు. ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాల్సిన తొలి ఏడాది ఆర్ధిక లోటు భర్తీలో ఇంకా ఇవ్వాల్సిన దానిపై ఏదీ తేల్చలేదు. 16 వేల కోట్ల రూపాయల లోటుకు గాను 4 వేల కోట్ల రూపాయల మాత్రమే ఇచ్చారు. మిగిలిన దానిలో ఎంత ఇచ్చేది ఈ బడ్జెట్ లో పేర్కొనక పోవడం ఆందోళనకరం. ఐఐటీ, నిట్, ఐఐఎం, ట్రిపుల్ ఐటీ, ఐజర్ తదితర విద్యాసంస్థలకు ఒక్క పైసా కూడా కేటాయించకపోవడం దారుణం. అమరావతి, పోలవరం ప్రాజెక్టు పనులు నిలిచిపోయి నాలుగు నెలలైనా, ఈ బడ్జెట్ లో వాటికి కేటాయింపులు లేవు. విశాఖ, విజయవాడ మెట్రోలు, కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు తదితర అంశాలకు కేటాయింపులు ఎందుకు చేయలేదు? ఈశాన్య రాష్ట్రాలకు కేటాయించే నిధులను బడ్జెట్ లో చూపెట్టి, వాటితో పాటు తీవ్ర ఆర్ధికలోటులో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు నిధుల అంశం విస్మరించడం కేంద్రానికి తగదు. వ్యవసాయ సంక్షోభం నుంచి బైటపడేందుకు ఈ బడ్జెట్ లో ప్రాధాన్యం ఇస్తారన్న రైతాంగం ఆశలను నీరుగార్చారు. నదుల అనుసంధానం, ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు ప్రస్తావనే లేదు. - చంద్రబాబు, తెదేపా జాతీయ అధ్యక్షుడు
వేతన జీవులు,మధ్యతరగతి ప్రజలను కేంద్ర బడ్జెట్ తీవ్ర అసంతృప్తికి గురి చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. డిజిటల్ చెల్లింపులపై ట్యాక్స్ ఎత్తివేత నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న ఆయన... గతంలో ఈ వ్యవహారంపై కమిటి ఛైర్మన్ గా ఉన్నప్పుడు తాను ఇచ్చిన సిఫారసులలో ఈ నిర్ణయమే కీలక అంశమని గుర్తుచేశారు. కాస్త ఆలస్యమైనా ఈ నిర్ణయాన్ని అమల్లోకి తేవడంపై హర్షం వ్యక్తం చేశారు.