ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చంద్రబాబు.. అంతకు ముందు.. ఆ తర్వాత! - పరిపాలనలో సాంకేతికత వినియోగం

అడ్మినిస్ట్రేటర్.. రిఫార్మర్.. సీఈఓ.. హైటెక్ సీఎం.. ఇవీ మొదటి సారి ముఖ్యమంత్రి అయినప్పుడు.. చంద్రబాబు గురించి వినిపించిన మాటలు..! చంద్రన్న.. సంక్షేమం.. సాగునీరు.. టెక్నాలజీ.. చంద్రబాబు గురించి ఇప్పుడు చెబుతున్న మాటలు..!!  మొదటి సారి  ముఖ్యమంత్రిగా  ఒకే పంథాలో వెళ్లిన చంద్రబాబులో రెండోసారి సీఎం అయ్యాక వచ్చిన మార్పులేంటి..? టెక్ సీఎం చంద్రబాబు.. చంద్రన్న ఎలా అయ్యారు... ?

చంద్రబాబు.. అంతకు ముందు.. ఆ తర్వాత

By

Published : Apr 3, 2019, 5:54 PM IST

చంద్రబాబు.. అంతకు ముందు..ఆ తర్వాత

అప్పుడు..

తెలుగు రాజకీయాల్లో చంద్రబాబు ఓ సంచలనం. ఉమ్మడి ఆంధ్రకు ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా... నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా ఆయన చెరిగిపోని రికార్డులు సృష్టించారు. అలుపెరుగని పోరాటం.. పట్టుదల. అనుకున్నది సాధించే తత్వం ఆయన సొంతం. అభివృద్ధి, సమర్థ అడ్మినిస్ట్రేషన్​కి మారుపేరు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆధునిక సాంకేతికత వినియోగాన్ని పరుగులు పెట్టించి రికార్డు సృష్టించారు. ఇనన్నీ ఆయనకు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చాయి. ఇదే సమయంలో.. టెక్నాలజీ వెంట పరిగెత్తి సామాన్యుల సమస్యలను పట్టించుకోలేదనే విమర్శలు వచ్చాయి. రాష్ట్రంలో కరవు తాండవించడం బాబు విజన్​కు ప్రతికూలంగా మారింది. రైతుల్లో పెల్లుబికిన ఆగ్రహ జ్వాల.. చంద్రబాబును ఉమ్మడి రాష్ట్రంలో అధికారానికి దూరం చేసింది.

ఆ తరువాత..

అధికారానికి దూరం అయిన తర్వాత ఎక్కడ పొరపాటు జరిగిందో చంద్రబాబు వెంటనే గుర్తించగలిగారు. ప్రతిపక్షనేతగా రైతు పోరుబాట పట్టారు. సాగునీటి ఉద్యమంలో భాగంగా.. ఉమ్మడి రాష్ట్ర సరిహద్దుల్లో ఆందోళనలు చేశారు. రైతన్నల కోసం.. ఆమరణ దీక్ష చేపట్టారు. పోరాటంలో భాగంగా పోలీసు కేసులూ ఎదుర్కొన్నారు. అధికారానికి దూరమైన ఈ పదేళ్లలో ఆయన ఎక్కువగా పాల్గొన్న కార్యక్రమాలు రైతులకు సంబంధించినవే. 2009లో వివిధ సమీకరణాలతో అధికారానికి దూరమైనా... రాష్ట్ర విభజన జరిగిన అనూహ్య పరిస్థితుల్లో నవ్యాంధ్రకు ముఖ్యమంత్రి అయ్యారు.

ఇప్పుడు..

రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు తీరు పూర్తిగా మారిపోయింది. తనను తాను నూతనంగా ఆవిష్కరించుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణమాఫీని అమలు చేసిన చంద్రబాబు... ప్రభుత్వ పదవీకాలం ముగిసేముందు అన్నదాత సుఖీభవ అంటూ మరో భారీ పథకాన్ని ప్రకటించేశారు. అటు సంక్షేమాన్ని... ఇటు సంస్కరణలను కలగలపి.. సవారీ చేస్తున్నారు. ఆర్టీజీఎస్ లాంటి అధునాతన టెక్నాలజీని పరిపాలనలో భాగం చేశారు. ఇటు.. ఆడపడుచులకు 'పసుపు- కుంకుమ' పంచారు. ఓ వైపు అమరావతి లాంటి అద్భుత .. ఆధునిక నిర్మాణాన్ని చేపడుతూనే మరోవైపు జీవనాడి లాంటి పోలవరాన్ని పూర్తిచేస్తున్నారు. సీఎం సహాయనిధి నుంచి లెక్కలేసుకోకుండా 'లెక్క'ఇస్తున్నారు. పెద్దలందరికీ పెన్షన్లు.. ఉద్యోగులకు భత్యాలు.. నిరుద్యోగులకు భృతులు.. ఎక్కడా ఏదీ తగ్గకుండా చూసుకున్నారు. పదుల సంఖ్యలో పథకాలు పెట్టి.. కేవలం సంక్షేమానికే లక్ష కోట్లకు పైగా ఖర్చు చేశారు.

సంక్షేమానికి మరింత ఖర్చు

తాజా ఎన్నికల్లో అంతకు మించిన హామీలు ఇచ్చారు. అధికారంలోకి వస్తే.. గతం కంటే ఎక్కువగా సంక్షేమానికి ఖర్చు చేయనున్నారు. అలాగని టెక్నాలజీని ఏ మాత్రం వదిలేయలేదు. హైదరాబాద్​లో సాప్ట్​వేర్​కు ప్రోత్సాహం ఇస్తే .. ఈ దఫా నవ్యాంధ్రలో హార్డ్ వేర్​కు ప్రాధాన్యం ఇచ్చారు. తిరుపతి - సత్యవేడులో పెద్ద ఎత్తున మొబైల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు తెచ్చి ఉపాధి కల్పించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్​చైన్ ఐఓటీ, ఫిన్​టెక్ వంటి నూతన సాంకేతికతలకు ప్రాధాన్యత ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా ఏపీని నిలిపారు. అన్ని పథకాలు ప్రవేశపెట్టడమే కాదు.. అవి ఎలా ఉంటున్నాయో పర్యవేక్షించడానికి, అమలులో సమస్యలను తెలుసుకోవడానికి 1100 అంటూ కాల్ సెంటర్ ను పెట్టింది కూడా ఆంధ్రప్రదేశే.! చంద్రబాబులో ఈ మార్పు చూసి.. అంతా ఆశ్చర్యపోయే పరిస్థితి. తెదేపా ఈ స్థాయిలో సంక్షేమ పథకాలను ఇంతకముందెన్నడూ అమలు చేయలేదన్నది ఆ పార్టీ నేతల భావన. చంద్రబాబులో రెండో వెర్షన్ చూసి.. కార్యకర్తలు ఖుషీ అవుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details