26లో గెలిచింది కేవలం ముగ్గురు మాత్రమే - undefined
ఫ్యాన్ సునామీ రాకతో అన్ని పార్టీల అభ్యర్థులు ఉక్కిరిబిక్కిరి అయిపోయారు..సాదాసీదా అభ్యర్థులే కాదు...మంత్రుల హోదాల్లో ఉన్న వారు కూడా ఆ సునామీలో కొట్టుకుపోయారు. తెదేపా ప్రభుత్వం చంద్రబాబు సహా మంత్రివర్గంలో ఉన్న 26 మంది మంత్రుల్లో గెలిచింది కేవలం ముగ్గురు మాత్రమే.
రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ప్రభంజనం సృష్టించారు. సెంచరీ కొట్టడమే కాదు...150 పైగా స్థానాల్లో పాగా వేసి నవ్యాంధ్ర అధినాయకుడిగా నిలిచారు. ఈ తుపాన్ లో వివిధ పార్టీలు ప్రకటించిన అభ్యర్థులు అడ్రసులు గల్లంతైపొయాయి. అందులో పార్టీల అభ్యర్థులే కాదు...తెదేపా ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు రెండంకెల సంఖ్యలో ఉన్నారు. 2014 లో వైకాపా తరపున గెలిచి తెదేపా తీర్థం పుచ్చుకుని మంత్రివర్గంలో స్థానం సంపాదించిన ఎమ్మెల్యేలు కూడా ఈ జాబితాలో ఉన్నారు.
ఫ్యాన్ గాలి ముందు మంత్రులు నిలవలేకపోయారు, ముగ్గురు మినహా అందరూ ఓటమి పాలయ్యారు. చంద్రబాబు సహా మంత్రివర్గంలో 26 మంది మంత్రులు ఉండేవారు. వీరిలో ఎండీ ఫరూఖ్, యనమల రామకృష్ణుడు ఎన్నికల్లో పోటీ చేయలేదు. పరిటాల సునీత, కేఈ కృష్ణమూర్తి ఎన్నికలకు దూరంగా ఉండి వారసులను బరిలో నిలిపారు. మరో ఇద్దరు మంత్రులు శిద్దారాఘవరావు, ఆదినారాయణరెడ్డి లోక్ సభ బరిలో నిలిచారు.
మంత్రుల్లో అచ్చెన్నాయుడు, చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు గెలుపొందారు. ఎమ్మెల్సీలుగా ఉండి మంత్రులుగా కొనసాగిన నారాయణ, లోకేశ్ మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి చేదు ఫలితం చవి చూశారు. మరో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ ఎన్నికలకు ముందే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి సర్వేపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి వైకాపా అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఏ సభలోనూ సభ్యుడిగా లేకుండా నేరుగా మంత్రిగా పని చేసిన కిడారి శ్రావణ్ కుమార్ అరకు బరిలో నిలిచి డిపాజిట్ కూడా సాధించలేకపోయారు.
వైకాపా నుంచి వచ్చిన ఎమ్మెల్యేల్లో అమరనాథ్ రెడ్డి, సుజయ్ కృష్ణ రంగారావు, ఆదినారాయణరెడ్డి, భూమాఅఖిల ప్రియ చంద్రబాబు కేబినెట్ లో మంత్రలుగా స్థానం దక్కింది. ఈసారి ఎన్నికల్లో తెదేపా తరపున అభ్యర్థులుగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
TAGGED:
cabinet ministers