బీపీఎస్ను పొడిగిస్తారా? ముగిస్తారా?
స్థానిక సంస్థలకు ఆదాయాన్ని సమకూర్చేందుకు, అక్రమ కట్టడాలను నియంత్రించేందుకు ప్రభుత్వం కొన్ని నెలల కిందట ప్రవేశపెట్టిన భవనాల క్రమబద్ధీకరణ పథకం (బీపీఎస్) నేటితో ముగియనుంది. ఇప్పటికే రెండు పర్యాయాలు గడువు పొడిగించిన ప్రభుత్వం... మరోసారి గడువు పెంచుతుందా? లేదా?
ఈ రోజే అవకాశం ఉంది. అనుమతులు లేకుండా కట్టిన భవనాలను క్రమబద్ధీకరించుకునేందుకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన గడువు.. నేటితో ముగుస్తోంది. వాస్తవానికి.. మూడు నెలల కాలపరిమితితో.. ఏప్రిల్ 6 వరకు అవకాశం ఇస్తూ గతంలో ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఆశించిన స్పందన లోకపోడం.. ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో ఏప్రిల్ నెలాఖరు వరకు ఓసారి, జూన్ 6 వరకు మరోసారి గడువు పొడిగించింది.
పోలింగ్, ఫలితాల విధుల్లో ఇన్నాళ్లూ తీరిక లేకుండా ఉన్న అధికారులు.. ఈ పథకంపై పూర్తి స్థాయి సమయం కేటాయించని ఫలితంగా.. ప్రభుత్వానికి ఆశించిన ఆదాయం వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. 2015 - 2017లో ఇదే పథకం అమలైనపుడు విజయవాడ పరిధలో చూస్తే.. 120 కోట్లకు పైగా ఆదాయం రాగా.. ఇప్పుడు పూర్తి భిన్నమైన పరిస్థితి ఉంది. 6 వేల దరఖాస్తులు వస్తాయనుకుంటే ఇప్పటివరకూ 2 వేలు దాటడమే కష్టంగా మారడం.. వాస్తవాన్ని స్పష్టం చేస్తోంది.
గతంలో బీపీఎస్ను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేలా విజయవాడ నగర పరిధిలోని 3 సర్కిళ్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఆన్ లైన్ దరఖాస్తులు స్వీకరించారు. నగరంలోని ముఖ్య కూడళ్లలో ప్రచారంతో పాటు.. ప్రకటనల బోర్డులు ఏర్పాటు చేశారు. గడువులోపు క్రమబద్ధీకరించుకోని భవనాలపై గుర్తులు వేశారు. కూల్చేస్తామని హెచ్చరించారు. ఇంటింటికీ నోటీసులు పంపించారు. ఈ సారి ఆ స్థాయిలో ప్రణాళిక అమలు చేయలేకపోవడమే.. ఆశించిన ఫలితం సాధించలేకపోవడానికి కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాంకేతిక సమస్యలూ.. దరఖాస్తుదారుల సహనానికి పరీక్ష పెట్టాయి. ఈ నేపథ్యంలో.. భవనాల క్రమబద్ధీకరణ గడువును.. మూడోసారి పొడిగిస్తారా? లేదా? అన్నది.. చర్చనీయాంశమైంది.