కృష్ణానది కరకట్ట వెంట అక్రమ కట్టడాలు, ప్రజావేదిక తొలగింపుపై శాసనమండలిలో వాడివేడి చర్చ జరిగింది. ఈ అంశంపై వైకాపా సభ్యుడు జంగా కృష్ణమూర్తి వేసిన ప్రశ్నకు మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానం చెప్పారు. మొత్తం 26 కట్టడాలకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. కృష్ణానది వెంట 6 వేల ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయని... చాలా కట్టడాలు ఉన్నాయని... వీటన్నింటినీ కూలుస్తారా అని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ప్రశ్నించారు.
భాజపా ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ... చట్టాలు ఉల్లంఘించి కట్టడాలు చేయటం సరికాదని... ప్రజావేదిక కూల్చకుండా వేరేచోటికి తరలిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. గోకరాజు, మంతెన సత్యనారాయణ రాజు కట్టడాలు కూలుస్తారా అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. వైఎస్ హయాంలోనే కరకట్ట వెంట కట్టడాలు వెలిశాయని యనమల అన్నారు. వీటన్నింటికీ సమాధానం చెప్పిన బొత్స.... అప్పుడు తప్పు జరిగితే వాటిని అలాగే ఉంచాలా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఉంటున్న భవనం కూడా అక్రమ కట్టడమేనని... నోటీసులకు సమాధానం వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. చంద్రబాబు ఉండే నివాసానికి అనుమతులు ఉంటే కోర్టుకు ఎందుకు చూపలేదని ప్రశ్నించారు. నీటిపారుదల శాఖ అనుమతి లేకున్నా ప్రజావేదిక నిర్మించారని తెలిపారు. చంద్రబాబు ఇళ్లు ఖాళీ చేస్తే ప్రజలకు మంచి సందేశం ఇచ్చినట్లవుతుందని బొత్స సూచించారు.