పోలింగ్‌కు సమయం తక్కువ ఉన్నందున భాజపా ప్రచార వేగం పెంచి... వ్యూహాలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలకు దీటుగా ప్రచారం చేసి... ప్రజల మనసు దోచుకోవాలని తహతహలాడుతోంది. ఏ అవకాశాన్నీ వదులుకోవద్దని పట్టుదలగా ఉంది. ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ... సహా పలువురు కేంద్ర మంత్రులను రంగంలోకి దించనుంది. ఈ నెల 29న రాజమహేంద్రవరంలో తలపెట్టిన విజయ సంకల్ప సభలో మోదీ పాల్గొననున్నారు. ఏప్రిల్ 1న కర్నూలు జిల్లాలో జరిగే సభకూ వస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కేంద్ర మంత్రులూ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించనున్నారు.
ప్రజాకర్షక మేనిఫెస్టో
ఇప్పటికే మేనిఫెస్టో రూపొందించిన భాజపా... ఇవాళ కేంద్రమంత్రి పీయూష్‌గోయల్ చేతుల మీదుగా విజయవాడలో విడుదల చేయనుంది. ఈ ఐదేళ్లలో రాష్ట్రానికి చేసిన పనులు, అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్రం ఇచ్చిన నిధులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందులో పొందుపరిచినట్లు తెలుస్తోంది. ప్రజాకర్ష పథకాలు ప్రకటించనున్నట్టు సమాచారం. ప్రజావ్యతిరేకతను దూరం చేసుకునేలా ఎన్నికల ప్రచారం ఉంటుందని భాజపా నేతలు చెబుతున్నారు.