రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని అడ్డుకోవటమే వైకాపా, భాజపా, తెరాస లక్ష్యమని తెదేపా అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. ఏపీ ప్రజల జీవనాడి పోలవరంపై సాక్షి పత్రికలో తప్పుడు కథనాలు ఇస్తున్నారని ఆరోపించారు. వైకాపా రాష్ట్రంపై విషం చిమ్ముతోందని మండిపడ్డారు. తెరాస ఇచ్చే వెయ్యి కోట్లు, కేసీఆర్ దగ్గర మెప్పు కోసమే... సాక్షి పత్రికలో తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 7 ముంపు మండలాలు లాక్కోవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్న లంకా.. పోలవరం నిర్మిస్తే తెలంగాణకు నష్టమని సాక్షి పత్రికలో కథనాలు రాయిస్తున్నారని ఆరోపించారు. కావలిలో అవసరమైతే భాజపాతో జతకడతానని జగన్ అన్నారని గుర్తు చేశారు. కేసీఆర్, జగన్... భాజపాకు మిత్రులేనని పీయూష్ గోయల్ అన్న మాటల్ని ప్రస్తావించారు. వైకాపా, భాజపా, తెరాస కలిసి వచ్చినా... చంద్రబాబు పోలవరాన్ని పూర్తి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.