రాష్ట్రంలో ఐపీఎస్‌ల బదిలీ... రాజకీయ దుమారాన్ని రేపుతోంది. నిఘా విభాగాధిపతి సహా ఇద్దరు ఎస్పీలను ఎన్నికల సంఘం బదిలీ చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... రాజ్యాంగ సంస్థనే ఢీ కొట్టేందుకు సమాయత్తమైంది. ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించడం లేదని ఆరోపిస్తూ... నేరుగా ఈసీతోనే తలపడుతోంది. ఈసీ ఇచ్చిన ఆదేశాలను కాదని కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సంఘం బదిలీ చేసిన ఇంటెలిజెన్స్ డీజీని.. విధుల నుంచి రిలీవ్ చేసేందుకు నిరాకరించింది. మరోవైపు ఈసీ నిర్ణయంపై హైకోర్టు తలుపునూ తట్టింది.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ ప్రచారం ఎంతజోరుగా సాగుతోందో... అంతే స్థాయిలో వివాదాల హోరూ పెరుగుతోంది. 15 రోజుల క్రితం రాష్ట్రవ్యాప్తంగా ఫారం-7 దరఖాస్తులపై వివాదం తలెత్తితే... ఇప్పుడు ఐపీఎస్ బదిలీలవ్యవహారంతో మరింత వేడెక్కింది. ప్రతిపక్షం ఆరోపణలతోముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీచేయాలని ఈసీ ఆదేశించింది.
ఈసీ ఆదేశాల మేరకు... కడప, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం... ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును మాత్రం రిలీవ్ చేసేందుకు నిరాకరించింది. ఆయన స్థాన చలనంపై... ఈసీ ఇచ్చిన ఉత్తర్వులు నిలిపివేసింది. నిబంధనల ప్రకారం ఇంటెలిజెన్స్ డీజీ ఈసీ పరిధిలోకి రానందున బదిలీ నిలిపివేసినట్టు తేల్చి చెప్పింది. కడప, శ్రీకాకుళం ఎస్పీలను బదిలీ చేస్తూ సీఎస్ కొత్త జీవో ఇచ్చారు.
అంతకు ముందు.. చంద్రబాబు ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల దృష్ట్యా... డీజీపీ, పోలీసు యంత్రాంగాన్ని సీఈసీ పరిధిలోకి తెస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో... ఇంటెలిజెన్స్ డీజీకి మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం... డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకూ ఎన్నికల సంఘం పరిధిలోకి తీసుకొచ్చింది. తాజా ఉత్తర్వుల ప్రకారం... ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకూ సీఈసీ పరిధిలోనే పోలీసు యంత్రాంగం పనిచేయనుంది. ఈసీ నిబంధనల మేరకే తాజా ఉత్తర్వులు ఇచ్చామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈసీతో తాడో పేడో
స్వతంత్రంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం... మోదీ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారిందని రాష్ట్రప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇదే విషయంపై న్యాయస్థానంలో పోరాటం చేస్తోంది. ఐపీఎస్‌ల బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం .. హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ వేసింది. గట్టిగానే వాదనలు వినిపించింది. ఎన్నికల విధుల్లో ఇంటెలిజెన్స్ డీజీ లేరన్న పత్రాన్ని సమర్పించాలన్న ధర్మాసనం... ఆధారాలతో ప్రమాణ పత్రాలు దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వం తరఫున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. మే 27 వరకు పోలీసు అధికారులంతా ఈసీ పరిధిలోనే ఉంటారని కోర్టుకు తెలిపారు. అనంతరం పిటిషన్ విచారణ రేపటికి వాయిదా పడింది.