ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దిల్లీ పై దండయాత్ర - చంద్రబాబు

విభజన హామీల అమలు విషయంలో ఏపీకి జరిగిన అన్యాయాన్ని దిల్లీ వేదికగా ఎలుగెత్తి చాటేందుకు సమాయత్తమైంది అధికార తెలుగుదేశం పార్టీ.కేంద్రం వైఖరిని ఖండిస్తూ దిల్లీ వేదికగా ధర్మపోరాటాన్ని దీక్షను చేపట్టనున్నారు.

దిల్లీలో ధర్మపోరాట దీక్ష

By

Published : Feb 10, 2019, 8:06 AM IST

కేంద్రంపై పోరాటం విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం ఆఖరి ఘట్టానికి సిద్ధమవుతోంది. విభజన హామీల అమలు విషయంలో ఏపీకి జరిగిన అన్యాయాన్ని దిల్లీ వేదికగా ఎలుగెత్తి చాటేందుకు సమాయత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో చేపట్టిన ధర్మపోరాటాన్నిదేశ రాజధాని దిల్లీ వేదికగా చేపట్టబోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు దేశ రాజధానిలో ఒకరోజు దీక్ష చేయనున్నారు. హామీల అమలు కోసం.. ఇప్పటి వరకూ చేసిన ఏ ప్రయత్నం ఫలించలేదు. ఆఖరి బడ్జెట్ కూడా పూర్తయింది. ఇక వచ్చేది.. ఇచ్చేదీ ఏమీ లేనందున రాజకీయంగా భాజపాను దెబ్బకొట్టేందుకే తెదేపా తయారైంది. సోమవారం జరగబోయేది ఓ రకంగా దిల్లీపై దండయాత్రే..!
విభజన హామీలను అమలు చేయాలంటూ నాలుగేళ్ల పాటు చేసిన వేడుకోళ్లు పనిచేయకపోవడంతో.. ఎన్డీఏకి వీడ్కోలు పలికిన తెదేపా.. ఆ తర్వాత నుంచీ పోరాటాన్ని ఉద్ధృతం చేసింది. ప్రత్యేక హోదాతో సహా.. అన్ని హమీలు అమలు చేయాలంటూ.. గల్లీ నుంచి దిల్లీ వరకు పోరాటాన్ని తీవ్రం చేసింది. రాష్ట్రానికి భాజపా ప్రభుత్వం చేస్తున్న అన్యాయం ఇదీ అంటూ.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ.. ధర్మపోరాట వేదికలు పెట్టి మరీ చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు దిల్లీ వేదికగా అదే పనిచేయబోతున్నారు. కేంద్రం తీరును దేశం ముందుంచడంలో ఇప్పటి వరకూ చేస్తున్న పోరాటంలో ఇది ముఖ్య ఘట్టంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దిల్లీలో జరగబోయే.. ధర్మపోరాటదీక్షకు అటు పసుపుశ్రేణులతో పాటు.. ప్రజానీకం కూడా పెద్ద ఎత్తున రాజధాని బాట పడుతున్నారు.
కేంద్రంతో ఢీ..
రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఎన్డీయే కూటమిలో చేరామని చంద్రబాబు అనేక వేదికలపై స్పష్టం చేశారు. విభజన హామీల అమల్లో కేంద్రం పూర్తిగా విఫలం కావటం వల్ల...రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్రం నుంచి వైదొలిగామని చెప్పిన ఆయన ఆ తర్వాత అనేక దశలుగా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఎన్డీఏకు వ్యతిరేకంగా తెదేపా పార్లమెంట్ లో అవిశ్వాసాన్ని తీసుకురావడం.. పోరాటాన్ని మరింత తీవ్రతరం చేసింది. ఇటు తెదేపా ప్రభుత్వం పోరాటాన్ని చేస్తున్న క్రమంలోనే .. ఆ పార్టీ నేతలపై కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థలతో దాడులకు దిగడం మరింత అగ్గి రాజేసింది. ఈ క్రమంలో చంద్రబాబు తమ పంథాను మార్చారు. కేంద్రంపై పోరాడుతున్న పార్టీలపై ఇది ఎదురుదాడి అంటూ.. దేశవ్యాప్తంగా పార్టీలను కూడగట్టడం మొదలు పెట్టారు. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనానికి వ్యతిరేకంగా అనేక ప్రాంతీయ పార్టీలు గళమెత్తాయి. వీటితో కాంగ్రెస్ కలవడంతో కాక మొదలైంది. ఇప్పటికే జాతీయ స్థాయి ప్రతిపక్షకూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న చంద్రబాబు.. ఈ దీక్ష ద్వారా.. మోదీని రాజకీయంగానూ.. దెబ్బకొట్టేందుకు యత్నిస్తున్నారు. రాష్ట్రాల పట్ల మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును జాతీయ స్థాయిలో ప్రచారం చేయనున్నారు. నమ్మిన తమనే మోసం చేశారంటూ.. ఇప్పటికే తెదేపా చేస్తున్న వాదనకు సానుకూలత కనిపిస్తోంది. దీనికి మరింత మద్దతు కూడగట్టాలన్నది చంద్రబాబు ప్రయత్నం

దిల్లీలో ధర్మపోరాట దీక్ష
.
ముమ్మర ఏర్పాట్లు...
ఇప్పటికే రాజధాని దిల్లీ వీధులన్నీ నల్ల రంగులో ఉన్న ధర్మపోరాట దీక్ష పోస్టర్లతో దర్శనమిస్తున్నాయి. ఆంధ్రా భవన్ వేదికగా జరగబోయే ఈ నిరసన సభలో సీఎం చంద్రబాబు 12గంటల పాటు దీక్షలో కూర్చోనున్నారు. ఈ సభలో ముఖ్యమంత్రి సహా నేతలందరూ నల్ల చొక్కాలను ధరించేలా కనిపిస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల నుంచి కార్యకర్తలు ప్రత్యేక రైళ్లల్లో దిల్లీకి పయనమైయ్యారు.
భారీ సభతో ముగింపు..
దిల్లీ వేదికగా నిర్వహించబోయే ధర్మపోరాట దీక్ష అనంతరం చివరగా రాష్ట్రంలో భారీ స్థాయిలో నిర్వహించేలా కసరత్తు చేస్తోంది తెదేపా అధినాయకత్వం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాలో ధర్మపోరాట సభలు నిర్వహించారు. చివరగా తలపెట్టే ఈ సభకు జాతీయ స్థాయి నేతలందర్నీ రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సభతోనే ఎన్నికల శంఖారావాన్ని మోగించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details