ఈ ఎన్నికల్లో 79.64 శాతం పోలింగ్ నమోదైంది. 2014 ఎన్నికలతో పోలిస్తే 2019లో 1.68 శాతం మేర అధికంగా పోలింగ్ నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా పురుషుల కంటే 4లక్షల17వేల 82 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉండడంతో పోలైన ఓట్లలోనూ... పురుషుల కంటే 2లక్షల 35వేల 398 మంది మహిళల ఓట్లు అధికంగా ఉన్నాయి. పోలైన ఓట్లలో 50.37 శాతం ఓట్లు మహిళలవి కాగా...49.63 శాతం ఓట్లు పురుషులవి.
తెదేపా... అతడే అన్నీ...
ఈ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థుల ఎంపిక మొదలు... ప్రచారం వరకు అన్నీ బాధ్యతలు చంద్రబాబే మోశారు. సిట్టింగ్, ఆశావాహులు అందరి మధ్య సయోధ్య కుదర్చడం, కార్యకర్తలు, నేతల మధ్య సమన్వయం పెంచడం, నేతల మధ్య దూరాన్ని తగ్గించడంలో చంద్రబాబు సఫలమయ్యారు. అందుకే గెలుపుపై తెదేపా ధీమాగా ఉంది. కొన్నిచోట్ల ప్రతిపక్ష వైకాపా గట్టిపోటీ ఇస్తుందని అంచనా వేసి సిట్టింగ్లకు మళ్లీ అవకాశం ఇవ్వలేదు. ప్రత్యర్థుల వ్యూహాల్ని ముందే పసిగట్టి... తగిన చర్యలు తీసుకున్నారు చంద్రబాబు.
జగన్ ఎక్కడా తగ్గలేదు...
వైకాపా ప్రధాన ప్రత్యర్థి తెదేపాతో పోల్చుకుంటే... జగన్ ఎక్కడా తగ్గకుండా తన వ్యూహాలకు పదునుపెడుతూ... ఎన్నికలను ఎదుర్కొన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు వర్సెస్ జగన్ అన్నట్లు ఎన్నికలు జరిగాయి. జగన్ కూడా అదే విధంగా ప్రసంగాలు చేసి ఆకట్టుకున్నారు. వైకాపా తరఫున జగన్ వన్ మ్యాన్ షో చూపించారు. పార్టీకీ, అభ్యర్థులకు, కార్యకర్తలకు అన్నీ తానై నిలిచి ఎన్నికలను ఎదుర్కొన్నారు.