ప్రొటెం స్పీకర్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే అప్పలనాయుడు..? - ap assmebly protem speaker aapalnaidu
శాసనసభ ప్రొటెం స్పీకర్ గా బొబ్బిలి నియోజకవర్గం నుంచి గెలిచిన వైకాపా ఎమ్మెల్యే శంబంగి చిన్న అప్పలనాయుడు నియమితులయ్యే అవకాశం ఉంది.
కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఈనెల 12 న శాసన సభ తొలి సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ప్రొటెం స్పీకర్‌గా విజయనగరం జిల్లాకు చెందిన వైకాపా ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు నియమితులయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బొబ్బిలి శాసనసభ నియోజకవర్గం నుంచి ఆయన ఇప్పటికి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన అనంతరం శాసనసభ సమావేశాల తొలి రోజునే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పదవీ ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాత శాసనసభ స్పీకర్ ఎన్నికను నిర్వహించాల్సి ఉంటుంది. కొత్తగా ఎన్నికైన శాసన సభాపతికి పదవీ బాధ్యతలు అప్పగించిన తర్వాత ఆయన పదవీకాలం ముగుస్తుంది. శాసనసభలో అత్యధికసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వారు ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రొటెం స్పీకర్‌ను గవర్నర్ నియమిస్తారు. ప్రస్తుత శాసనసభలో అత్యధిక సార్లు గెలుపొందిన వారిలో చంద్రబాబు ఉన్నారు. ఆయన 8 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా , 2 పర్యాయాలు ప్రతిపక్షనేతగానూ వ్యవహరించారు. ప్రస్తుత సభలో ఆయనే ప్రతిపక్షనేతగా ఉండనున్నారు. అందుకే ఆయన ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించే అవకాశం లేదు. తర్వాత వైకాపా నుంచి పెద్ది రెడ్డి రామ చంద్రారెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి , తెదేపా నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి 6వసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైకాపా ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం దక్కితే ముందుగానే ప్రమాణ స్వీకారం చేయనున్నందున వారిని ప్రొటెం స్పీకర్‌లుగా వ్యవహరించే అవకాశం చాలా తక్కువ. తర్వాత సీనియర్టీ దృష్ట్యా శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడును ప్రొటెం స్పీకర్ గా అవకాశం కల్పించాలని అధికార పార్టీ నిర్ణయించింది. త్వరలో గవర్నర్ నుంచి ఆదేశాలు రానున్నట్లు తెలిసింది.