ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 12, 2019, 9:19 PM IST

ETV Bharat / state

శ్వేతపత్రంలో ఒకటి.. బడ్జెట్​లో మరొకటి: చంద్రబాబు

ప్రభుత్వం చెప్పే మాటలకు.. చేతలకు ఏ మాత్రం పొంతన లేదని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆక్షేపించారు. బడ్జెట్ కేటాయింపులే ఇందుకు నిదర్శనమన్నారు.

babu

బడ్జెట్ లో కేటాయింపులపై.. తెదేపా జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందుచూపు లేని బడ్జెట్ ప్రవేశపెట్టారని వ్యాఖ్యానించారు. వైకాపా మాటలకు, చేతలకు పొంతన లేదనేందుకు ఇదే నిదర్శనమన్నారు. శ్వేతపత్రంలో ఒకలా చెబుతారనీ... బడ్జెట్‌లో మరోలా పేర్కొంటారనీ చంద్రబాబు ఎద్దేవా చేశారు. 2014లో తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే 6 వేలే ఎక్కువ ఉందన్న చంద్రబాబు... ఇవాళ రూ.38 వేలు ఎక్కువ కావడం తెదేపా ప్రభుత్వ ఘనత కాదా? అని ప్రశ్నించారు.

''ఐటీ, ఎలక్ట్రానిక్స్‌లో 49 వేల ఉద్యోగాలు వచ్చాయని మీ లెక్కలే చెప్పాయి. ప్రాజెక్టులకు కోతలు పెట్టి రాష్ట్ర ప్రగతికి గండికొట్టారు. ప్రాజెక్టులకు బడ్జెట్‌లో కేటాయింపుల్లో 22 శాతం కోత పెట్టారు. పొరుగు రాష్ట్రంలో నీళ్లు పారించేందుకే దృష్టి పెట్టారు. సున్నావడ్డీ రుణాలకు 4 వేల కోట్లు అవసరమైతే వందకోట్లే కేటాయించారు. బీసీల సంక్షేమానికి నిధుల్లో కోత పెట్టారు. 139 కార్పొరేషన్లు అన్నారు, వాటికి కేటాయింపులపై స్పష్టత లేదు. డ్వాక్రా మహిళలకు రూ.1,788 కోట్లే కేటాయించారు. డ్వాక్రా రుణాల రద్దు, మహిళలకు 75 వేల హామీలకు కేటాయింపుల్లేవు. వచ్చే ఏడాది నుంచి చేస్తామని ఈ బడ్జెట్‌లో చెప్పడం మరో మోసం. అమ్మఒడి పథకాన్ని ఆంక్షల బడిగా మార్చారు. బడ్జెట్‌లో 43 లక్షల మంది తల్లులకే లబ్ధి అన్నారు. నిధులు లేకుండా ఐదేళ్లలో 25 లక్షల ఇళ్ల నిర్మాణం ఎలా సాధ్యం? మద్యాన్ని ప్రభుత్వమే ఎలా విక్రయిస్తుందని ప్రజలే ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వమే వ్యాపారం చేస్తూ దశలవారీ నిషేధం ముసుగు ఏమిటి? మద్యం కంపెనీల నుంచి ముడుపుల కోసమేనా నేరుగా మద్యం విక్రయం?రాజధానికి 500, కడప స్టీల్‌ప్లాంట్‌కు 250 కోట్లతో పనులెలా చేస్తారు?'' అంటూ జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు విరుచుకుపడ్డారు.


స్థిరాస్తి రంగం హైదరాబాద్ తరలిపోయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశఆరు. లక్షలమంది కూలీలు, కార్మికులు ఉపాధి కోల్పోయారన్నారు. ఆర్టీసీ విలీనం, ఉద్యోగుల క్రమబద్ధీకరణలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. నిరుద్యోగ భృతికి కేటాయింపులు లేవన్నారు.

ABOUT THE AUTHOR

...view details