ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతన్నకు అండగా అన్నదాత సుఖీభవ...!

ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు సీఎం చంద్రబాబు శుభవార్త అందించారు. చిన్న, సన్నకారు రైతులకు మేలు చేకూర్చే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐదెకరాల లోపు రైతులకు రూ.9వేలు సాయం అందిస్తామని సీఎం ప్రకటించారు. కేంద్రం ఇచ్చే సాయం రూ.6వేలతో పాటు రూ.9వేలు కలిపి మొత్తం రూ.15వేలు ఇస్తామని స్పష్టం చేశారు.

By

Published : Feb 17, 2019, 6:02 AM IST

రైతన్నకు అండగా అన్నదాత సుఖీభవ

రాష్ట్ర రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు మరో వరం ప్రకటించారు. గతంలో ప్రకటించిన సాయాన్ని మరింత పెంచారు. ఐదు ఎకరాలలోపున్న రైతు కుటుంబాలకు 15వేల రూపాయలు, 5ఎకరాలు పైబడిన వారికి 10వేలు ఇవ్వాలని నిర్ణయించారు. కౌలు రైతులకూ ఆర్థిక ప్రయోజనం చేకూర్చనున్నట్లు వెల్లడించారు. మొత్తంగా రైతులకు దాదాపు రూ. 6 వేల 600 కోట్ల మేర లబ్ధి చేకూర్చాలని సర్కారు నిర్ణయించింది.

రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన అన్నదాత సుఖీభవ పథకానికి మరింత మెరుగులు దిద్దుతూ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఐదెకరాలలోపు అన్నదాతలకు కేంద్రం ఇచ్చే సాయం రూ.6 వేలతో పాటు రూ.9 వేలు కలిపి మొత్తం రూ.15 వేలు ఇస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో 54 లక్షల చిన్న, సన్నకారు రైతు కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతు కుటుంబాలకు రూ.10 వేలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం సాయం అందించనుంది. ఈ నిర్ణయంతో దాదాపు 70 లక్షల రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.

రైతన్నకు అండగా అన్నదాత సుఖీభవ

రాష్ట్రంలో ఖరీఫ్, రబీల్లో కలిపి ఈ దఫా 1.80 కోట్ల ఎకరాలు సాగవుతుందని అంచనా వేస్తున్నారు. ఖరీఫ్, రబీ కాలాల్లో రెండు విడతల్లో ఈ మెుత్తం చెల్లిస్తారు. కేంద్ర పథకంలో 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు మాత్రమే రూ. 6 వేలు లబ్ధి కలుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ పథకంలో.. రైతుకు ఎన్ని ఎకరాలున్నా కనిష్ఠంగా 10వేలు అందుతుంది.

ఖరీఫ్ మొదలు కాగానే పంటల సాగు ఆధారంగా కౌలు రైతుల గుర్తింపు కార్యక్రమం ప్రారంభించి ఆయా కుటుంబాలకు 10వేల రూపాయల చొప్పున అందించనున్నారు. రాష్ట్రంలో కౌలు రైతు కుటుంబాలు దాదాపు 9లక్షలు ఉంటాయని ఆంచనా. భూములున్న రైతుల వివరాలు రెవెన్యూ శాఖకు చెందిన వెబ్ ల్యాండ్ లో అందుబాటులో ఉన్నాయి. కుటుంబాలకు సంబంధించిన సమాచారం ప్రజా సాధికార సర్వే ద్వారా సేకరిస్తారు. ఈ రెండింటిని అనుసంధానించనున్నారు. ఇప్పటి దాకా 70 లక్షల కుటుంబాల వివరాలు సిద్ధం చేసినట్లు సమాచారం. రియల్ టైం గవర్నెన్స్ కేంద్రం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. వీటిని బ్యాంకులకు పంపించి నగదు బదిలీ చేయించే కార్యక్రమం చేపట్టనున్నారు.

మొత్తంగా 5 ఎకరాల లోపు ఉన్నకుటుంబాలకు రూ. 4 వేల కోట్లు, 5 ఎకరాలు పైబడిన కుటుంబాలకు మరో రూ. 800 కోట్లు కౌలు రైతులకు 900కోట్లు కలిపి దాదాపు ఏటా రూ. 6600 కోట్ల భారం సర్కారు భరించనుంది.

ABOUT THE AUTHOR

...view details