ప్రతీ సోమవారం అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ స్పందన కార్యక్రమాన్ని తప్పక నిర్వహించాలని... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. ప్రతి మూడో శుక్రవారం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి స్పందన కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేయాలన్న సీఎస్... ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. ప్రజా ఫిర్యాదుల స్థితి తెలుసుకునేలా 2నెలల్లోగా జిల్లా పోర్టల్‌ను తీసుకురావాలని సీఎస్ అధికారులను ఆదేశించారు.
శాసనసభలో ప్రవేశపెట్టే బిల్లులు రూపకల్పనలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. అనవసర ఖర్చులు తగ్గించి వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో ఆసుపత్రులు, విద్యా సంస్థలు, వసతి గృహాల నిర్వహణపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం... రాత్రిపూట వసతిగృహాల్లో బస చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలోని వివిధ పాఠశాలల పరిస్థితిని రెండేళ్లలో పూర్తిగా మెరుగపర్చాలనే ఆలోచన చేస్తున్నారని... వాటి ప్రస్తుత ఫొటోలు తీసి వైబ్సైట్లో అప్లోడ్ చేసేలా చూడాలన్నారు.