ఫలితాల్లో కనిపించని జనసేన.. కారణాలివేనా? - undefined
సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో జనసేన ఖాతా తెరవలేకపోతోంది. అధినేత పవన్.. 2 స్థానాల్లో వెనకంజలో ఉండడం.. ఆ పార్టీ శ్రేణులను నిరుత్సాహానికి గురిచేస్తోంది.
janasena
ముఖ్యమంత్రిని చేయండి... అన్ని వర్గాలూ సంతృప్తి పడే పాలన అందిస్తానంటూ ప్రజల్లోకి వెళ్లిన జనసేనకు.. సార్వత్రిక ఎన్నికల్లో నిరాశాజనక ఫలితాలు వెలువడుతున్నాయి. అభ్యర్థుల సంగతి పక్కనబెడితే... స్వయానా పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. పోటీ చేసిన 2 స్థానాల్లోనూ వెనకంజలో ఉన్నారు. విశాఖపట్నం జిల్లా గాజువాక, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పవన్ ను ఓటర్లు ఆదరించలేదు. ఇందుకు చాలా కారణాలు కనిపిస్తున్నాయి.
- రాజకీయ నాయకుడిగా.. ప్రజల్లో విశ్వాసం కల్పించకపోవడమే.. పవన్ కు మైనస్ గా మారింది. కొన్ని రోజులు తెదేపాపై తీవ్ర విమర్శలు చేసిన పవన్.. ఎన్నికల ప్రచారం ముగుస్తుందనగా వైకాపాపై విరుచుకుపడ్డారు. ఈ తీరు.. ప్రజలను విస్మయానికి గురి చేసింది.
- హామీలను ప్రజల్లోకి సరిగా తీసుకెళ్లలేకపోడం... పవన్ కే కాదు.. యావత్ జనసేనకూ ఇబ్బందికరంగా పరిణమించింది. ఈ ప్రభావం.. సహజంగానే పవన్ పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లోనూ కనిపించింది.
- ప్రచార సభల్లో ఆవేశపూరిత ప్రసంగాలకే ప్రాధాన్యం ఇచ్చిన పవన్ కల్యాణ్... ప్రజల సమస్యలు, వాటికి సరైన పద్ధతుల్లో పరిష్కారాలపై దృష్టి పెట్టకపోవడం.. ప్రస్తుత ఫలితానికి కారణమైంది.
- పార్టీ పరంగా చూస్తే.. అభ్యర్థుల ఎంపికే జనసేన ఓటమికి దారి తీసింది. చాలా నియోజకవర్గాల్లో.. తెదేపా, వైకాపా అభ్యర్థుల ఖరారు తర్వాతే.. జనసేన అభ్యర్థులు ఎంపికవడం చూస్తే.. జంప్ జిలానీల కోసమే ఆ పార్టీ నాయకత్వం ఎదురుచూసినట్టు కనబడుతోంది. అంతే కాక.. ప్రజల్లో అంతగా బలం లేని వామపక్షాలు, రాష్ట్రంలో అడ్రస్సే లేని బీఎస్పీ లాంటి పార్టీతో పొత్తు.. జనసేనకు బెడిసికొట్టాయి. అంతిమంగా.. పార్టీ అభ్యర్థులనే కాదు.. అధినేత పవన్నూ ఓటమిపాలు చేశాయి.
- ఈ ఫలితాలను జనసేన.. ముందుగానే అంచనా వేసినట్టుగా స్పష్టమవుతోంది. అందుకే.. తమకు గెలుపు ప్రధానం కాదని.. ఫలితాలతో సంబంధం లేకుండా ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగుతూనే ఉంటుందని.. పవన్, లక్ష్మీనారాయణ లాంటి నేతలు ప్రకటనలు ఇచ్చారు. ఇప్పుడు.. వారి స్పందన ఎలా ఉంటుందన్నది.. జనసేన అడుగులు ఎటు పడతాయన్నదీ.. ప్రజల్లో.. జనసేన శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.
TAGGED:
BPL