ఆహార శుద్ధి పరిశ్రమలతో రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఫుడ్ పార్కు పనుల పురోగతిపై ఫుడ్ పార్కు యాజమన్యాలు, ఆహారశుద్ధి సీఈవో వైఎస్ ప్రసాద్, అధికారులతో సచివాలయంలో మంత్రి అమర్నాథ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నా రైతుల ఆదాయం రెట్టింపు చేసే ఆహారశుద్ధి పరిశ్రమలకు రాయితీలు ఆలస్యం కాకుండా ఇస్తున్నామన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆహార శుద్ధి పరిశ్రమలకు 350 కోట్ల రూపాయల సబ్సిడీలు విడుదల చేశామని మంత్రి తెలిపారు. ఫుడ్ పార్కులను త్వరితగతిన అభివృద్ధి చేయాలని, ఏమైనా ఆటంకాలు ఎదురైతే వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు తాను చొరవ చూపుతానని మంత్రి హామీ ఇచ్చారు. ఉత్తర కోస్తాలో జీడిపప్పు యూనిట్లు ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. అందు వల్ల ఈ యూనిట్లు స్థాపించేవారికి 25 శాతం సబ్సిడీ ఇవ్వాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉందని మంత్రి చెప్పారు.