ఎన్నికల సమరానికి ఈసీ సమాయత్తం - elections
రాజకీయ పార్టీలను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు ఏపీలోని పార్టీలతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సమావేశం నిర్వహించారు. ఎన్నికల సమయంలో వ్యవహరించిన తీరుపై సూచనలు చేశారు. ఓటు నమోదుకు కేవలం 5 రోజులు మాత్రమే గడువు ఇవ్వడంపై పార్టీలన్నీ అభ్యంతరం తెలిపాయి.

సార్వత్రిక ఎన్నికల ప్రణాళిక విడుదలైన నేపథ్యంలో ఎన్నికల సంఘం రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతో సమావేశాన్ని నిర్వహించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చినందున నిబంధనల్ని కచ్చితంగా పాటించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేది... రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. రాష్ట్రంలో కొత్త ఓటర్ల నమోదుకు 5 రోజులు మాత్రమే గడువు ఇవ్వడంపై అన్ని పార్టీల ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశాయి. లక్షల సంఖ్యలో ఓట్లు గల్లంతైనందున ప్రచారం కల్పించాలని, ఓట్ల తనిఖీకి విస్త్రత ఏర్పాట్లు చేయాలని ద్వివేదికి విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘంతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. షెడ్యూల్ ప్రకటించినందున ఓట్ల తొలగింపు సాధ్యపడదని స్పష్టం చేశారు. కొన్ని పార్టీల సమావేశాలపై పోలీసులు ఉద్దేశపూర్వకంగా వివక్ష పాటిస్తున్నారని సీపీఎం నేతలు ఆరోపించారు. ఓటు నమోదుపై విస్తృత ప్రచారం కల్పించాలని వైకాపా నేతలు కోరారు. కోడ్ అమల్లోకి వచ్చినా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ప్రచార హోర్డింగ్‌లను తొలగించలేదని బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘం నిర్వహించిన సమావేశానికి అధికార తెదేపాతో పాటు, కాంగ్రెస్, జనసేన పార్టీలు హాజరు కాలేదు.