రాజధాని ప్రాంతమైన గుంటూరులో కాలుష్యం కోరలు చాస్తోంది. దుమ్ము, ధూళి కణాల రేణువులతో నగర ప్రజానీకం ఉక్కిరిబిక్కిరవుతోంది. దేశంలో వాయు కాలుష్యం ఎక్కువున్న నగరాల్లో గుంటూరు ఉన్నట్లు కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకటించడంతో వాయుకాలుష్య తీవ్రత మరోసారి వెల్లడైంది. నగరంలో కాలుష్యానికి ఎన్నో కారణాలు.. మరెన్నో కోణాలు కనిపిస్తున్నాయి.
కాలుష్య కోరల్లో.. గుంటూరు నగరం - Guntur city of pollution
గాలిలో సూక్ష్మ దూళికరణాలు 90 కంటే ఎక్కువగా ఉన్న 15 నగరాల్లో గుంటూరు నగరం కూడా చేరింది. దేశంలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాల్లో గుంటూరు ఉన్నట్లు కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకటించటంతో నగరంలోని వాయుకాలుష్య తీవ్రతెంటో మరోసారి వెల్లడైంది. కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు విధించినా క్షేత్రస్థాయిలో మాత్రం పట్టించుకునే పరిస్థితి కనిపించటం లేదు.
గాలిలో సూక్ష్మ ధూళికణాలు (పీఎం-10).... 90 కంటే ఎక్కువున్న 15 నగరాల్లో గుంటూరు నగరం కూడా చేరింది. సుమారు 10 లక్షల జనాభా ఉన్న గుంటూరులో గాలిలో ధూళికణాలు పరిమితికి మించి విడుదలై ప్రజల ఆరోగ్యానికి సవాలు విసురుతున్నాయి. నగరం చుట్టూ పేరేచర్ల, పలకలూరు వంటి ప్రాంతాల్లో వెలిసిన స్టోన్ క్రషర్లు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. జిల్లాకు రాజధాని రాకతో కంకర ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. రోజుకు వేల టన్నుల కంకర ఉత్పత్తి తయారీకి అత్యాధునిక యంత్రాలను ఏర్పాటు చేసుకున్నారు. గాలిలో లేచే ధూళికణాలు నియంత్రించేందుకు కాలుష్య నియంత్రణ మండలి కొన్ని నిబంధనలు విధించినా... ఇవేమీ క్షేత్రస్థాయిలో పూర్తిగా అమలుకావడం లేదు. ఫలితంగా గాలిలో ధూళికణాలు పెరిగి ప్రజల అనారోగ్యానికి కారణమవుతున్నాయి. గుంటూరు-హైదరాబాద్, గుంటూరు-కర్నూలు మార్గంలో నిత్యం ప్రయాణించేవారు కాలుష్యం బారిన పడుతున్నారు. రాజధానిగా మారడంతో గుంటూరులో పెరిగిన వాహనాల సంఖ్య కూడా కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. గుంటూరు రాజధానిగా మారటంతో భవనాలు, రహదార్ల నిర్మాణం పెరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు సైతం గాలిలో దుమ్ము, ధూళి కణాల ఉత్పత్తికి పరోక్షంగా దోహదపడుతున్నాయి. నగరం చుట్టూ పత్తి జిన్నింగ్, స్పిన్నింగ్ మిల్లులు వాయు కాలుష్యానికి పరోక్షంగా హేతువుగా మారుతున్నాయి. ఇలా..... నియంత్రణ లేకుండా వాయుకాలుష్యాన్ని ఎవరికి వారు యథేచ్ఛగా వెదజల్లుతుండటంతో సమస్య తీవ్రత పెరిగింది.
గుంటూరులో పెరిగిన వాయు కాలుష్య తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం స్పందించాల్సిన అవసరముంది. కాలుష్య నియంత్రణ మండలిని క్రియాశీలంగా మార్చటంతోపాటు కాలుష్య నియంత్రణకు ప్రణాళికాయుతంగా చర్యలు చేపట్టాల్సిన అవసరముంది.