ఫొని ప్రభావంపై కేంద్ర కేబినెట్ కార్యదర్శి సమీక్ష - కేంద్ర కేబినెట్ కార్యదర్శి సమీక్ష
మే 2, 3 తేదీల్లో ఫొని ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న కేంద్ర కేబినెట్ కార్యదర్శి సిన్హా.. తుపాను ప్రభావిత రాష్ట్రాల యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రభావిత రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమీక్షించారు.
బంగాళాఖాతంలో ఫొని తుపాను ప్రభావంపై.. ఢిల్లీ నుంచి కేంద్ర కేబినెట్ కార్యదర్శి సిన్హా వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. తుఫానును ఎదుర్కొనేందుకు ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం జిల్లా యంత్రాంగాలను పూర్తి అప్రమత్తం చేశామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఆయనతో పాటు.. వీడియో కాన్ఫరెన్స్‌లో పుదుచ్చేరి, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బంగా ప్రభుత్వాల సీఎస్‌లు పాల్గొని.. తమ రాష్ట్రాల్లోని పరిస్థితులు వివరించారు. మే 2, 3 తేదీల్లో ఫొని ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న కేంద్ర కేబినెట్ కార్యదర్శి.. తుపాను ప్రభావిత రాష్ట్రాల యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. విద్యుత్, టెలికం సేవలకు తోడు తాగునీటి సరఫరాకు అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరించేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సహాయ చర్యల నిమిత్తం ఎన్డీఆర్ఎఫ్, కోస్టుగార్డు, షిప్పింగ్, టెలికం సంస్థల సిబ్బంది పూర్తిగా సిద్ధంగా ఉండాలని చెప్పారు.