Yanadi community women fire on YSRCP leaders: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన నేతలు.. పార్టీ అండదండలు చూసుకుని అక్రమ సంపాదన కోసం అమాయక ప్రజలను మాయమాటలతో మోసం చేస్తున్నారు. అక్రమ సంపాదనే ధ్యేయంగా సహజ వనరులను కొల్లగొడుతున్నారు. గ్రానైట్ నిక్షేపాల పేరుతో కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. తాము చెప్పినట్టు చేస్తే.. శాశ్వత ఇళ్లు కట్టిస్తామని, నష్ట పరిహారం చెల్లిచెస్తామని, అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీలిచ్చి.. కాలనీవాసులను ఖాళీ చేయించారు. చివరికు వారికి కావాల్సిన సంపాదను దోచుకుని, మాట మార్చేస్తున్నారు. తాజాగా బాపట్ల జిల్లా బల్లికురవ మండలం మల్లాయపాలెంలోని ఎస్టీ కాలనీలో గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయంటూ.. అధికార పార్టీకి చెందిన నాయకులు తమను దారుణంగా మోసం చేశారంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ నివాసాల్లో ఉండలేక నానా అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు.
గ్రానైట్ నిక్షేపాల పేరుతో మోసాలు.. బాపట్ల జిల్లా బల్లికురవ మండలం మల్లాయపాలెం గ్రామ పంచాయితీ పరిధిలో సుమారు 30 నుండి 40 యానాది సంఘం(ఎస్టీ కాలనీ) కుటుంబాలు ఊరికి దూరంగా నివాసముంటున్నారు. ఈ క్రమంలో గ్రామ పొలాల్లో గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయంటూ.. కొంతమందివైఎస్సార్సీపీ నేతలు గ్రామ రైతుల వద్ద పొలాలను కొనుగోలు చేసి, గ్రానైట్ క్వారీలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గ్రానైట్ నిక్షేపాల కోసం క్వారీలలో బ్లాస్టింగ్ జరిపితే, ప్రాణనష్టం జరుగుతుందని గ్రహించిన అద్దంకి వైసీపీ బాద్యుడు.. యానాది కాలనీ వాసుల వారితో మాట్లాడారు. అనంతరం కాలనీ ఖాళీ చేస్తే.. 'మీకు మంచి ఇళ్లు కట్టిస్తానని, దాంతోపాటు కొంత ధనం ముట్టజేస్తానని' హామీ ఇచ్చి వారిని అక్కడ నుండి ఖాళీ చేయించారు. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఎన్‌ఓసి తెచ్చుకొని.. గ్రానైట్ నిక్షేపాలను వెలికి తీయటం మొదలుపెట్టారు.